కొత్త తరహా సైబర్ మోసం..ఐదుగురు సైబర్ క్రైమ్ కేటుగాళ్లు అరెస్టు

by Ratna Kumari |

సిమ్‌ స్వాప్‌ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఛేదించారు.

కొత్త తరహా సైబర్ మోసం..ఐదుగురు సైబర్ క్రైమ్ కేటుగాళ్లు అరెస్టు
X

దిశ‌, శేరిలింగంప‌ల్లి : సిమ్‌ స్వాప్‌ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రూ.15 లక్షల నగదు, 10 మొబైల్‌ ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వివరాలు వెల్లడించారు. నిందితులు సిటీ బ్యాంక్‌ ప్రెస్టీజ్‌ క్రెడిట్‌ కార్డ్‌ విభాగం అధికారులమంటూ బాధితులకు ఫోన్‌ చేసి, డాట్‌ వెరిఫికేషన్‌ పేరుతో ఈ-సిమ్‌లను ఫిజికల్‌ సిమ్‌లుగా మార్చుకునేలా ప్రలోభపెట్టారు. అనంతరం బాధితుల వద్దకు కొరియర్‌ ద్వారా పంపిన మొబైల్‌ పరికరాల్లో ముందుగానే మాలిషియస్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసి, వాటిలో సిమ్‌లు పెట్టించేవారు.

దీంతో ఓటీపీలు, బ్యాంకింగ్‌ అలర్ట్‌లు నిందితుల వద్దకు మళ్లి, బాధితుల బ్యాంక్‌ ఖాతాల నుంచి అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మొత్తం రూ.77.75 లక్షలు మోసం చేసినట్లు తేలింది. ట్రాన్సిట్‌ వారెంట్లపై నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, 5 సిమ్‌కార్డులు, సిటీబ్యాంక్‌ లేబుల్స్‌, మోటరోలా స్టిక్కర్లు, వాయిస్‌ ట్రాన్స్‌మీటర్‌ కేబుల్‌ స్వాధీనం చేసుకున్నారు.

Next Story