- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సర్కిళ్లు షురూ.. 6 నుంచి 12కు పెరిగిన ఆఫీసులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో పరిపాలనను వికేంద్రీకరించేందుకు కొత్త జోనల్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.

దిశ , హైదరాబాద్ బ్యూరో : జీహెచ్‌ఎంసీ పరిధిలో పరిపాలనను వికేంద్రీకరించేందుకు కొత్త జోనల్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా 27 పట్టణ, స్థానిక సంస్థలను విలీనం చేసిన తర్వాత కొత్తగా మల్కాజ్‌గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా మొత్తం జోన్ల సంఖ్య 6 నుంచి 12కు చేరాయి. అంతేకాకుండా జీహెచ్ఎంసీ పరిధిని 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా విభజించడంతో బల్దియాలో సరికొత్త పాలన మొదలు కానుంది. కొత్త జోన్లు, సర్కిళ్లతో పరిపాలన సులభతరం చేయడంతో పాటు పౌర సేవలు మెరుగ్గా అందించడానికి వీలు కానుంది. విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ ప్రాంతంలో పాలన, సేవల పంపిణీని మెరుగుపరచడం ఈ చర్య లక్ష్యం కాగా.. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డివిజన్ విభజన, జోనల్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అధికారిక ముగింపుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో నెంబర్ 292ను జారీ చేసిన విషయం తెలిసిందే. పునర్వ్యవస్థీకరణను ఖరారు చేయడానికి ముందు జీహెచ్ఎంసీ దాదాపు రెండు వారాల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది. అందిన ప్రాతినిధ్యాలను పరిశీలించిన తర్వాత అధికారులు సరిహద్దులను సవరించారు.
నాలుగు నుంచి 7 సర్కిళ్లు..
కొత్తగా జారీ చేసిన జీవో ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 12 జోన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఎల్బీ నగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లు ఉండగా.. కొత్త ఆదేశాలతో మరో ఆరు మల్కాజ్‌గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ ఏర్పాటయ్యాయి. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకృత నిర్ణయం తీసుకోవడం, మెరుగైన పౌర సేవలను అందించేందుకు వీటిని ఏర్పాటు చేయగా.. ప్రతి జోన్‌లో జనాభా, భౌగోళిక వ్యాప్తిని బట్టి కనీసం నాలుగు నుంచి గరిష్ఠంగా ఏడు సర్కిళ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన కొత్త జడ్సీలు..
పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన జోన్లకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించింది. కొత్త పరిపాలనా విభాగాలు ఆలస్యం లేకుండా పనిచేయడం ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొత్త జెడ్సీలు భోర్ఖడే హేమంత్ సహదేవ్ రావు (శేరిలింగంపల్లి), అపూర్వ చౌహాన్ (కూకట్ పల్లి), సందీప్ కుమార్ ఝా (కుత్బుల్లాపూర్), ఎస్ శ్రీనివాస్ రెడ్డి (చార్మినార్), జీ ముకుంద రెడ్డి (గోల్కొండ), ప్రియాంక అలా (ఖైరతాబాద్), అనురాగ్ జయంతి (రాజేంద్రనగర్), ఎన్ రవికిరణ్ (సికింద్రాబాద్), కే చంద్రకళ (శంషాబాద్), హేమంత కేశవ్ పాటిల్ (ఎల్‌బీ నగర్), సంచిత్ గంగ్వార్ (మల్కాజ్‌గిరి), రాధికా గుప్తా (ఉప్పల్) బాధ్యతలు చేపట్టారు.
జోన్ల పరిధిలోకి వచ్చే సర్కిళ్ల వివరాలు..
- మల్కాజ్ గిరి : కీసర, అల్వాల్, బోయిన్ పల్లి, మౌలాలి, మల్కాజ్ గిరి
- ఉప్పల్ : ఘట్ కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్
- ఎల్బీ నగర్ : నాగోల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్
- శంషాబాద్ : ఆదిభట్ల, బడంగ్ పేట్, జల్ పల్లి, శంషాబాద్
- రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్ పురా, ఫలక్ నుమా, చాంద్రాయణ గుట్ట, జంగమ్మెట్
- చార్మినార్ : సంతోష్ నగర్, యాకుత్ పురా, మలక్ పేట్, చార్మినార్ , ముసారాం బాగ్
- గోల్కొండ : గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్
- ఖైరతాబాద్ : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్ గూడ , అమీర్ పేట్
- సికింద్రాబాద్ : కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్ పేట్, తార్నాక, మెట్టుగూడ
- శేరిలింగంపల్లి : నార్పింగి, పటాన్ చెరు, అమీన్ పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి
- కూకట్ పల్లి : మాదాపూర్, ఆల్వీన్ కాలనీ, కూకట్ పట్టి, మూసాపేట్
- కుత్బుల్లా పూర్ : చింతల్ , జీడిమెట్ల , దుండిగల్, కొంపల్లి , గాజుల రామారం , నిజాం పేట్, మేడ్చల్






