డ్రైనేజీల నిర్వహణపై నిర్లక్ష్యం.. వర్షాకాలంలో ప్రజల్లో ఆందోళన

by Kodari Anjali |

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్వహణపై సంబంధిత శాఖల నిర్లక్ష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

డ్రైనేజీల నిర్వహణపై నిర్లక్ష్యం.. వర్షాకాలంలో ప్రజల్లో ఆందోళన
X

దిశ, చంపాపేట్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్వహణపై సంబంధిత శాఖల నిర్లక్ష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలపై మూతలు లేకపోవడం, మరికొన్ని చోట్ల నాణ్యతలేని మూతలు ఏర్పాటు చేయడం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించకపోవడంతో వర్షపు నీటి పారుదలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి కారణంగా వర్షపు నీరు సక్రమంగా వెళ్లక రోడ్లపై నిల్వ ఉంటోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. నీరు నిలిచిపోవడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలకు మూతలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు పేర్కొన్నారు.

ప్రత్యేక కార్యాచరణ చేపట్టి..

ఇప్పటికే ఏర్పాటు చేసిన మూతల చుట్టూ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించకపోవడం వల్ల వాటి ఉపయోగం లేకుండా పోతోందని విమర్శించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత మాత్రమే అధికారులు స్పందించడం సరైన విధానం కాదని, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేలా క్రమం తప్పకుండా ఫీల్డ్‌లో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు కార్యాలయాల్లోనే పరిమితం కాకుండా కాలనీల్లో పర్యటిస్తేనే ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్, డ్రైనేజీ, శానిటేషన్ విభాగాల అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను వెంటనే తొలగించాలని, మూతలు లేని డ్రైనేజీలకు బలమైన మూతలు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న వాటిని మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటేనే నీటి నిల్వ, పారిశుద్ధ్య సమస్యలు, ప్రమాదాలను నివారించవచ్చని చంపాపేట్‌కు చెందిన సామాజిక కార్యకర్త రామ్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

Next Story