పాఠశాల అనుమతులపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం

by Kodari Anjali |

నానాజీపూర్‌లో ఏర్పాటు చేసిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌కు అసలు అనుమతులే లేవు.

పాఠశాల అనుమతులపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, శంషాబాద్: నానాజీపూర్‌లో ఏర్పాటు చేసిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌కు అసలు అనుమతులే లేవు. పాఠశాల నిర్మాణానికి పంచాయతీ నుంచి పర్మిషన్ లేదని ఆయా శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి జోత్స్న స్పష్టం చేశారు. ఏడాదికిపైగా నిర్మాణం కొనసాగుతున్నా కూడా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గురించి పూర్తిస్థాయిలో విచారణ జరపగా పలు సంచలన అంశాలు వెలుగు చూశాయి.

విద్యాశాఖ నుంచి అనుమతి ఏదీ..?

నానాజీపూర్‌లో ఏర్పాటు చేసిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌కు అసలు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని శంషాబాద్ మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 13న పాఠశాలను ఘనంగా ప్రారంభోత్సవం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తూ అందుకు సంబంధించి కొన్ని రోజులుగా భారీగా ప్రచారం చేస్తున్నారు.

సీబీఎస్సీ, కేంబ్రిడ్జి అంటూ ప్రచారం..

అసలు పాఠశాలకే అనుమతులు లేని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. తమ పాఠశాలకు సీబీఎస్సీ, కేంబ్రిడ్జి అనుమతులు ఉన్నాయని పాఠశాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. నిబంధనల ప్రకారం పాఠశాలకు సీబీఎస్సీ కేటాయించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పాఠశాల ప్రారంభించి నిబంధనల ప్రకారం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో పని చేసే టీచర్లకు సీబీఎస్సీ శిక్షణ ఇచ్చిన తర్వాత సీబీఎస్సీ కేటాయిస్తారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అసలు అనుమతులు లేకపోయినా కూడా సీబీఎస్ఈ అంటూ బోర్డులు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా కేంబ్రిడ్జి అంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుకాల పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో పల్లవి స్కూల్ యాజమాన్యానికి సహకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story