దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నెట్ వర్క్ భగ్నం...

by Taduka Kalyani |   (  Updated:2025-01-29 14:50:58  IST  )

హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు సైబర్ క్రిమినల్స్ నెట్ వర్క్ నడ్డీని విరిచారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 62 మంది సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిని బుధవారం అరెస్టు చేశారు

దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నెట్ వర్క్ భగ్నం...
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు సైబర్ క్రిమినల్స్ నెట్ వర్క్ నడ్డీని విరిచారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 62 మంది సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిని బుధవారం అరెస్టు చేశారు. దాదాపు రూ.4.63 కోట్ల రూపాయాలను రికవరీ తో పాటు వారి ఖాతాల్లో కొంత నగదును జప్తు చేశారు. తాజాగా సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆర్ బీఎస్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ లలో పనిచేస్తున్న సేల్స్ మేనేజర్ తో పాటు ఇతర హోదా లలో ఉన్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు నేపాల్, చైనా, దుబాయ్ లలో ఉన్న ప్రధాన సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని దర్యాప్తులో తేల్చారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కొన్ని వందల కేసులలో ఈ 62 నేరస్థుల పాత్రను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ రూంలో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సైబర్ క్రైం ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారీకి గత ఏడాది ఆగస్టు నెలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాము పెట్టుబడులకు సంబంధించిన వాటిలో ప్రతి రోజు పెట్టుబడికి 20 శాతం లాభాలు వచ్చే విధంగా సహాయం చేస్తామని నమ్మించారు. అతనిని సీ 105, బ్లాక్ రాక్ , క్యాపిటల్ స్టాక్ గ్రూపులో చేర్చారు. మొదట వ్యాపారి 40 వేల రూపాయాలను పెట్టుబడిగా పెట్టారు. దీనికి వారు భారీ లాభాలు చూపించారు. ఆశ కల్పించి మీరు ఐపీఓ లు కొనాలని దానికి మా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే మీకు భారీ లాభాలు వస్తాయని అంకెల గారడీని చూపించారు. దీంతో వ్యాపారం దాదాపు రూ.93.89 లక్షల ను డిపాజిట్ చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాధానం తో పాటు విత్ డ్రా చేయకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేసిన అధికారులు ఈ చీటింగ్ లో బెంగళూరు విద్యా నారాయణపురం ఆర్ బి ఎల్ బ్రాంచ్ కి చెందిన శుభం కుమార్ ఝా, హారూన్ రషీద్ మల్లేశ్వరం యాక్సెస్ బ్రాంచ్ అధికారి, ఫాబ్రికేషన్ వర్క్స్ చేసే ఆర్ మోహన్ ల పాత్రను గుర్తించారు. శుభం కుమార్ ఝా బంధన్ బ్యాంక్ లో ఓ అకౌంట్ ను తెరిచి అందులో వ్యాపారీ నుంచి కొట్టేసిన 38 లక్షలు డిపాజిట్ అయ్యేలా చేశాడని పోలీసులు తేల్చారు. ఈ ఖాతాను కమిషన్ మీద నేపాల్ , చైనాలో ఉన్న ప్రధాని సైబర్ నేరగాళ్లకు అప్పజెప్పారని తేలింది. అదే విధంగా శుభమ్ కుమార్ ఝా ఇలా వందలాది అకౌంట్ లను తెరిచి వాటి యాక్సెస్ ను ప్రధాన సైబర్ నేరగాళ్లకు ఇచ్చి దేశ వ్యాప్తంగా 20 కేసులలో దాదాపు రూ.23 కోట్ల ను ప్రధాన సైబర్ నేరగాళ్లకు మళ్లించేలా చేశాడని గుర్తించి అతనితో సహకరించి మిగతా ఇద్దర్నీ కూడా అరెస్టు చేశారు. వీరి ఖాతాల్లో ఉన్న దాదాపు 2.87 కోట్ల రూపాయాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆర్డర్ అంటూ--

గుజరాత్ కు చెందిన హర్ పాల్ సింగ్ , సయ్యద్ అయూబ్ లు హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ డాక్టర్ (54) కు ఫోన్ చేసి మీ ఫోన్ నెంబరు మరో 2 గంటల్లో పని చేయదని చెప్పారు. మీ ఫోన్ నెంబరు తో దేశ భద్రతకు ముప్పు తలపెట్టే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన కేసులో దొరికిందని భయపెట్టించారు. మహిళ డాక్టర్ ఇదంతా అబద్దమని కొట్టి పారేయగా అయితే మీరు ఇప్పుడు స్కైప్ కాల్ చేసి మాట్లాడండి మీకంతా తెలుస్తుందని చెప్పారు. స్కైప్ కాల్ ద్వారా మాట్లాడుతుండగా మీతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాట్లాడతారని చెప్పి పోలీసు డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి ప్రత్యక్షమై ఇది దేశ భద్రతకు సంబంధించిన రహస్యమైన విచారణ. ఇందులో మీరు ఇరుక్కున్నారు. మీరు బయటపడాలంటే ముందు మేము చెప్పినట్లు చేయండంటూ నమ్మించారు.

ఇదిగో మిమ్మల్ని అరెస్టు చేయడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన ఆర్డర్ ఇదంటూ ఓ కాపీ ని చూపించారు. దీంతో కలవరానికి గురైన మహిళ డాక్టర్ చివరకు డిజిటల్ అరెస్టైంది. మీరు మీ దగ్గర ఉన్న డబ్బలన్ని పంపిస్తే వాటిని పరిశీలించి తిరిగి మీకు పంపించి మిమ్మల్ని కేసు నుంచి బయటపడేస్తామని మాయ మాటలు చెప్పారు. దీంతో మహిళ డాక్టర్ తన బ్యాంక్ లతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ లను సైతం విత్ డ్రా చేసి మొత్తం రూ.3 కోట్లు మాయగాళ్ల ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత వారి ఫోన్ లు పని చేయకపోవడంతో మోసపోయానని మహిళ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు దేశవ్యాప్తంగా 17 మందిని డిజిటల్ అరెస్టు చేసి కోట్లాది రూపాయాలను కొట్టేశారని తేలింది.

బ్యాంక్ సేల్స్ మేనేజర్ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు--

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జేఎన్ టీయూ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ కాటా శ్రీనివాస్ రావు, రెడ్డి ప్రవీణ్, మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ జునైద్, జయకిరణ్ క్రిష్ణ లతో కలిసి సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నాడు. రెడ్డి ప్రవీణ్ అమాయక యువతకు కమిషన్ లను ఎర వేసి వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపించి అందులో మోసపూరితంగా వచ్చిన డబ్బును దుబాయ్ లో ఉన్న ప్రధాన సైబర్ నేరగాళ్లకు క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గంలో పంపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి మేము చెప్పిన వాటిల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలంటూ నమ్మించారు. దీని కోసం అతనిని విఐపి-హెచ్ 8-5 అనే గ్రూపులో చేర్పించారు. ముందుగా 5 లక్షలు డిపాజిట్ చేయగా అతనికి భారీ లాభాల వచ్చినట్లు అంకెలు చూపించారు. అలా మొత్తం బాధితుడు 2.06 కోట్ల రూపాయాలను జమ చేశాడు. ఆ డబ్బులన్ని ఈ ముఠా తెరిచిన అకౌంట్ లలో పడగానే కొన్నింటిని క్రిప్టోల కరెన్సీ లోకి మార్చారు. మరికొన్ని ఖాతాల నుంచి నగదును డ్రా చేసి హవాలా రూపంలో దుబాయ్ కు పంపారని పోలీసులు గుర్తించి ఐదుగురిని అరెస్టు చేసి క్రిప్టో కరెన్సీ విలువ 40 లక్షల నగదు, 47.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

9 రాష్ట్రాల్లో 7 స్పెషల్ టీంల ఆపరేషన్ 52 మంది అరెస్టు---

వరుసగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ల నమోదైన కేసులపై అధికారులు ప్రత్యేకంగా 7 టీంలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం... గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, న్యూ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ హైదరాబాద్ లలో సోదాలు చేశారు. మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. వీరంతా దాదాపు 33 కేసులలో 8.83 కోట్ల రూపాయాలను కొల్లగొట్టారని దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా 574 కేసులలో వీరు నిందితులుగా ఉన్నారని తెలిసింది. వీరి వద్ద నుంచి దాదాపు 87.90 లక్షల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి--

సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ , ఫోన్ లలో గుర్తు తెలియని వారు మాట్లాడే మాటలను నమ్మొదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. వారి మాటలను నమ్మి డబ్బులను ఆన్ లైన్ లో డిపాజిట్ చేయొద్దు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని సీవీ ఆనంద్ తెలిపారు. మోసపోయినట్టు భావించినా, సైబర్ నేరస్థులకు సంబంధించిన ఫోన్ గా అనుమానం ఉంటే వెంటనే 1930 కు కాల్ చేయాలని ఆయన సూచించారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. మోసపోయిన మొదటి గంటలో 1930 కు ఫోన్ చేసే మీ డబ్బును సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడవచ్చని సీపీ చెప్పారు.

Next Story