ఓయూలో గిరిజన సంస్కృతి, జీవన విధానాలపై జాతీయ సదస్సు ప్రారంభం

by Kodari Anjali |

ఓయూలో గిరిజన సంస్కృతి, జీవనం, గతం, వర్తమానం, భవిష్యత్తు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

ఓయూలో గిరిజన సంస్కృతి, జీవన విధానాలపై జాతీయ సదస్సు ప్రారంభం
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లోని రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సెమినార్ హాల్‌లో గిరిజన సంస్కృతి మరియు జీవనం: గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రత్యేక ప్రస్తావనతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో గిరిజన సమాజాల అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ, భవిష్యత్ అవకాశాలపై విస్తృత చర్చలు జరిగాయి. సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ సలహాదారు దీపక్ ఖండేకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, అభివృద్ధి సంబంధిత సవాళ్లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి విధానపరమైన చర్చలు, సమిష్టి కార్యాచరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంస్కృతి, జీవన విధానాలపై..

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ గిరిజన సమాజాల అభ్యున్నతికి విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. “విద్య–వివేకం–వికాసం” అనే భావజాలంతో విశ్వవిద్యాలయం పనిచేస్తోందని, గిరిజన భాషలు, సంస్కృతి, జీవన విధానాలపై పలు పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ కె. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ 35 గిరిజన తెగల సామాజిక, సాంస్కృతిక జీవన విధానాలపై తన అధ్యయనాలను వివరించారు. గిరిజన సమాజాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సామాజిక సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రఖ్యాత పండితుడు ప్రొఫెసర్ పొలిగొండ సుబ్బాయ చారి గిరిజన సంస్కృతి, సాహిత్యం, సామాజిక వాస్తవాలపై విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. గిరిజన సమాజాల అభివృద్ధికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం. ప్రభాకర్, ఐఆర్‌ఎస్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story