Nampally: నుమాయిష్‌లో దోపిడీ..! పార్కింగ్ ఫ్రీ అంటూనే వసూళ్లు

by Ramesh Goud |

లక్షలాది మంది సందర్శకులు వీక్షించే నాంపల్లిలోని నుమాయిష్ పార్కింగ్ వివాదంగా మారుతోంది.

Nampally: నుమాయిష్‌లో దోపిడీ..! పార్కింగ్ ఫ్రీ అంటూనే వసూళ్లు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : లక్షలాది మంది సందర్శకులు వీక్షించే నాంపల్లిలోని నుమాయిష్ పార్కింగ్ వివాదంగా మారుతోంది. ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు లోనికి ఎంట్రీ ఫీజు మాత్రమే ఉంటుందని, పార్కింగ్ ఉచితమని, ఎలాంటి డబ్బులు వసూలు చేయబోమని సొసైటీ నిర్వాహకులు ప్రకటించారు. అయితే వారు చెప్పింది ఒకటి, వాస్తవంగా అక్కడ జరుగుతోంది మరొకటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సందర్శనకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ దోపిడీ యధేచ్ఛగా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. పే అండ్ టేక్ రిసిప్ట్ కంపల్సరి, ప్లీజ్ కో ఆపరేట్, ఆర్డర్ బై మేనేజ్‌మెంట్ అంటూ ఎంఏఎం ప్రభుత్వ జూనియర్ కాలేజీ (గర్ల్స్) అంటూ బహిరంగంగా బోర్డు ఏర్పాటు చేసి జబర్ధస్త్‌గా ద్విచక్ర వాహనానికి రూ.60, కారుకు రూ.150 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎగ్జిబిషన్‌కు వచ్చే వారు నిర్వాహకులతో వాదనకు దిగినా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ ఉచితమని చెప్పి ఇలా ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడం పట్ల సందర్శకులు మండిపడుతున్నారు. సొసైటీ సభ్యులకు, పార్కింగ్ నిర్వాహకులకు లోలోపల ఒప్పందం ఉందని, అందుకే బహిరంగంగా బోర్డు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు సైతం వినబడుతున్నాయి.

మాకు సంబంధం లేదంటూ అక్రమాలు.. ఎమ్మెల్యే రాజాసింగ్

ఎగ్జిబిషన్ సందర్శకుల వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో సైతం విడుదల చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎగ్జిబిషన్ (నుమాయిష్) షాప్‌ల అలాట్‌మెంట్‌లో అంతా స్కామ్ జరుగుతుందని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గవర్నమెంట్, మినిస్టర్ ఉంటే వారికి లాభం సపరేట్‌గా వెళ్లిపోతదని కామెంట్ చేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు నుమాయిష్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం మూలంగా ఎంజే మార్కెట్ నుంచి ఏక్‌మినార్ వరకు, అక్కడి నుంచి అసెంబ్లీ వరకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దీనిని నివారించేందుకు నుమాయిష్‌ను శివారు ప్రాంతంలో సుమారు 100 ఎకరాల స్థలం కేటాయించి తరలించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నిర్వాహకులు ఎలాంటి సమాచారం తనకు ఇవ్వడం లేదన్నారు. పార్కింగ్ ఫ్రీ అంటూనే వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు టెండర్లు ఎప్పుడు పిలిచారో తనకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్కింగ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుని ఫ్రీ పార్కింగ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ అన్నారు.

భద్రత డొల్ల..?

నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల భద్రత డొల్లగా మారింది. ఇలీవల ఓ జెయింట్ వీల్ పైకి వెళ్లిన తర్వాత తలకిందులుగా నిలిచిపోవడంతో అందులో ఎక్కిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. సుమారు అరగంట అనంతరం మరమ్మతులు చేసి కిందకు దించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని వందలాది స్టాళ్లు ఆహుతి అయ్యాయి. కోట్లాది రూపాయల విలువ జేసే ఆస్తి బుగ్గిగా మారింది. ప్రతి సంవత్సరం ఎంట్రీ టికెట్ ధరలను పెంచుతూ వస్తున్న సొసైటీ నిర్వాహకులు సందర్శకుల భద్రత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. మొత్తం మీద ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యం సందర్శకులకు జేబు గుల్ల చేయడమే కాకుండా ప్రాణాల మీదకు తెస్తుందని పలువురు వాపోతున్నారు.

ప్రిన్సిపాల్‌కే తెలియాలి.. పీఆర్వో రవి

గవర్నమెంట్ కాలేజీ తప్ప అన్ని ప్రాంతాల్లో పార్కింగ్ ఫ్రీ. ప్రభుత్వ కాలేజీలో వాళ్లు టెండర్ వేసుకొని వసూలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి ఎలాంటి సంబంధం లేదు. కాలేజీ ప్రిన్సిపాల్‌కు తెలియాలి. మాకు ఎలాంటి సంబంధం లేదు.

Next Story