- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరికొత్తగా నుమాయిష్.. జనవరి 1న లాంఛనంగా ప్రారంభం
85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది.

దిశ , హైదరాబాద్ బ్యూరో: 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు . జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 1050 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. కాగా.. సుమారు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు . ఎంట్రీ టికెట్ రూ.50గా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో ష్టేషన్లు ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఎంతో సౌకర్యంగా మారనున్నాయి. నుమాయిష్ కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో సమయాన్ని పొడిగించాలని సొసైటీ నిర్వాహకులు మెట్రో అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనుంది.
మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు..
సుమారు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకులు భద్రతపై దృష్టి సారించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నుమాయిష్ కు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతూ విద్యావ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు.
పిల్లలు, పెద్దలకు వినోదం..
ఎగ్జిబిషన్ మైదానంలో పిల్లలకు వినోదాన్ని పంచే ఆట బొమ్మలు, కొయ్య బొమ్మలు, కిచెన్ సామన్లు, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వంటి దుకాణాలను ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కావలసినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు, జెయింట్ వీల్స్, మైదానంలో తిరిగేందుకు రైలు వంటివి అందుబాటులో ఉన్నాయి . 2019లో ఎవరూ ఊహించని రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని కోట్ల రూపాయల ఆస్తి అగ్గి పాలైంది. ఈ ఘటనలో వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. 2020లో నిర్వహించినా 2021లో కోవిడ్ కారణంగా మూత పడింది. అయితే 2022 లో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు గాను సొసైటీ నిర్ణయం తీసుకుని సుమారు 1500 స్టాళ్లను ఏర్పాటు చేసింది . 2022 సంవత్సరంలో నుమాయిష్ కు కేటాయించిన పార్కింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ పర్యాయం అగ్నిమాపక యంత్రాలను సైతం అందుబాటులో ఉంచుతున్నారు .
34 సబ్ కమిటీలు..
34 సబ్ కమిటీలు, 106 మంది సెక్యూర్టీ గార్డులను ఏర్పాటు చేసి సమీక్షించనున్నారు. లోనికి లైటర్లు, సిగరెట్లు , గుట్కాలు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లడం నిషేదించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 138 మంది డే వాలంటీర్లు , 76 మంది నైట్ వాలంటీర్లతో కలుపుకొని మొత్తం 320 మంది పని చేయనున్నారు. గతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 1.5 లక్షల లీటర్ల సామర్ధ్యం గల రెండు గ్రౌండ్ వాటర్ ట్యాంకులు , 82 హైడ్రంట్స్, 45 మంది శిక్షణ పొందిన వలంటీర్లు, రెండు పది వేల లీటర్ల సామర్ధ్యం గల ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచారు.
గవర్నమెంట్ స్టాల్స్ ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రిజన్స్, తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ పోలీస్, మెప్మా , సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, ఎల్ ఐ సీ ఆఫ్ ఇండియా, టూరిజం డిపార్ట్ మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంటి ప్రభుత్వ శాఖలు ఎగ్జిబిషన్ మైదానంలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి.
ఫ్రీ పార్కింగ్..
ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం గృహకల్ప, చంద్ర విహార్, గగన్ విహార్, భీమ్ రావ్ వాడ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ విజిటర్లు తమ వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా హ్యాండ్ లూం హౌజ్ ను అనుసరించి ఉన్న బహుళ అంతస్థుల భవనంలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పెయిడ్ పార్కింగ్ లో కూడా వాహనాలు పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు.






