బేగంబ‌జార్ లో మోస్ట్ వాంటేడ్ అంత‌ర్రాష్ట్ర దొంగ అరెస్ట్

by Ratna Kumari |

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బేగంబ‌జార్ లో మోస్ట్ వాంటేడ్ అంత‌ర్రాష్ట్ర దొంగ అరెస్ట్
X

దిశ‌, కార్వాన్ : తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వ‌ద్ద‌ నుంచి రూ. 30 లక్షల విలువైన 206 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 2,14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ మార్గదర్శకత్వంలో, గోషామహల్ డివిజన్ ఏసీపీ కె. చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో బేగం బజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి. భరత్ కుమార్, డిటెక్టివ్ ఎస్ఐ కె. జగదీశ్వర్ రావు మరియు క్రైమ్ బృందం ఈ నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం డీసీపీ చంద్ర మోహన్ వివరాలు వెల్లడించారు.

మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉద్గీర్ గ్రామానికి చెందిన అమర్ సోన్‌కాంబ్లే (20) హైదరాబాద్‌లోని కిషన్ బాగ్‌లో ఉంటూ ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే మద్యం, సిగరెట్లు, పబ్బుల వంటి విలాసాలకు బానిసయ్యాడు. వెయిటర్ పని ద్వారా వచ్చే సంపాదన జులాయి ఖర్చులకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్నాడు. నిందితుడిపై గతంలో హైదరాబాద్ నగరంలో మూడు ఇళ్ల దొంగతనాలు ఒక పోక్సో కేసు నమోదై ఉన్నాయి. ఈ నెల మే 6న తెల్లవారుజామున గోషామహల్, హిందీ నగర్‌లోని ఎమ్. కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి వేళ తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. తన ఇండ్ల నుంచి సుమారు 235 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు బేగం బజార్ పీఎస్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన బేగం బజార్ క్రైమ్ బృందం ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలనుఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి, మే 17న అమర్ సోన్‌కాంబ్లేను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించగా.. అతని వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించి, సొత్తును రికవరీ చేసిన బేగం బజార్ పోలీస్ సిబ్బందిని గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story