హత్యలా..! ఆత్మహత్యలా..? గుంత పొంగనాలే ప్రాణాలు తీశాయా..?

by velandi.Saikiran |

మియాపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పేట్ లో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం

హత్యలా..! ఆత్మహత్యలా..? గుంత పొంగనాలే ప్రాణాలు తీశాయా..?
X

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పేట్ లో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద వారు, రెండేళ్ల బాబు రాత్రి ఇంట్లో పడుకున్న వారు తెల్లవారే సరికే విగత జీవులుగా మారడం అనేక అనుమానాలకు తావిస్తుంది. వారే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? లేదా ఎవరైన వారికి విషం ఇచ్చి చంపారా..? కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి మృత్యువాత పడడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అందరిని శోక సంద్రంలో ముంచెత్తుతుంది. వీరి మృతి వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృత్యువుతో తెల్లవారింది..

రోజు ఉదయమే లేచి పనులకు వెళ్లాల్సిన వారు.. ఉదయం 7 గంటలు అయినా ఇంకా ఆ ఇంటి తలుపులు తీయలేదు. అందరికంటే ముందుగానే లేచి అందరిని లేపే ఆ పెద్దాయన.. చీకట్లను చీల్చుకుని సూర్యుడు బయటకు వచ్చినా ఇంకా ఎందుకో లేవలేదు. ఉదయం 7 గంటలకే తోటివారితో కలిసి పనికి వెళ్లే పెద్దావిడ కూడా ఇంకా బయటకు రాలేదు. ఏమైంది ఇంకా తలుపులు తీయడం లేదని ఆఇంటి పక్కన వారు తలుపు కొట్టారు. అయినా ఉలుకూపలుకు లేదు. దీంతో అనుమానం వచ్చిన వారు కిటికీలో నుండి చూడగా అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే డోర్లు తీసి దగ్గరకు వెళ్లగా అప్పటికే అందరూ మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, సీఐ

అనుమాస్పద స్థితిలో ఐదుగురు మృతి చెందారని సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రం వారని, బ్రతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి గత కొద్ది కాలంగా ఇక్కడే ఉంటున్నారని, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో లక్ష్మప్ప(60), వెంకటమ్మ(55), అల్లుడు అనిల్(40), కవిత(38) అనిల్, కవితల కుమారుడు యువాన్ష్ (2)గా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం సేడం జిల్లా రంజోల్ ప్రాంతానికి చెందిన లక్ష్మప్ప తన భార్య వెంకటమ్మ, కొడుకు భగవంత్ (23) తో కలిసి మియాపూర్ మక్తా మహబూబ్ పేటలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. లక్ష్మప్ప అనారోగ్య కారణంగా ఇంటి వద్దనే ఉంటుండగా, ఆయన భార్య ఓ స్కూల్ లో ఆయమ్మగా పనిచేస్తుంది.

వెంకటప్పకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ కూతురు కవితను కర్ణాటక రాష్ట్రానికి చెందిన కలబుర్గి జిల్లా సేడం తాలూకా అనంతపురంకు చెందిన అనిల్ కు ఇచ్చి వివాహం చేశారు. అనిల్ కూడా నగరానికి వలసవచ్చి లంగర్ హౌస్ లో ఉంటూ మేస్త్రీగా పనిచేసేవాడు. అక్కడ సరిగ్గా పని దొరకడం లేదని గత నాలుగు రోజుల క్రితం అతని మామ అయిన లక్ష్మప్ప ఇంటికి వచ్చి మక్తా మహబూబ్ పేట్ లోనే ఉంటున్నారు. గత రాత్రి ఇంట్లో నిద్రించిన నలుగురితో పాటు వారి కుమారుడు యువాన్ష్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే బుధవారం సాయంత్రం లక్ష్మప్ప కుమారుడు ఆటో తీసుకుని బయటకు వెళ్లిపోయారని, ఎక్కడికి వెళ్లాడు..? ఎందుకు వెళ్లాడు అనేదానిపై ఇంకా ఎవరికి సమాచారం లేదు.

ఐదుగురి మృతిపై అనేక అనుమానాలు..

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిపై బంధువులు, స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతులకు పెద్దగా అప్పులు ఏమీ లేవని, పనిచేసుకుంటూ అందరితో సఖ్యతగా ఉండేవారని చెబుతున్నారు. తనకు కూడా నెలనెలా ఇంటి అద్దె సమయానికి ఇచ్చేవారని ఇంటి ఓనర్ గుండె గణేష్ తెలిపారు. ఎప్పుడూ గొడవలు పడినట్లు కూడా తన దృష్టికి రాలేదని అన్నారు. అయితే మృతురాలు వెంకటమ్మ తనకు కండ్లు తిరుగుతున్నాయని ఓసారి ఇంటికి రమ్మని దగ్గరలోనే ఉండే పెద్ద కూతురు లక్ష్మీకి ఫోన్ చేసి చెప్పగా ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిందని, అనంతరం 11.30 గంటలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మృతులు చివరిగా మాట్లాడింది తమ పెద్ద కూతురు లక్ష్మీతోనేనని తెలుస్తుంది.

ఆహారంలో ఏమైనా కలిపారా..?

మృతులు అందరూ రాత్రి పడుకునే ముందు గుంత పొంగణాలు తిన్నట్లు సమాచారం. అందులోనే ఏదైనా విషం కలిసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుంత పొంగణాల పిండి పాత్ర, పెనం తదితర వస్తువులు కూడా ఇంటి బయట ఉన్నాయి. అందులోనే విషం కలిసి ఉంటుందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం పలు ఆధారలను సేకరించారు. మృతుల కుటుంబీకులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనుమానిత మరణాలుగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు ఆర్ధిక బాధాలాతో ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story