మైనార్టీ యువత ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

by Ratna Kumari |   (  Updated:2026-04-21 15:28:37  IST  )

మైనార్టీ యువత ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు.

మైనార్టీ యువత ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : మైనార్టీ యువత ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉర్దూ మస్కన్ ఆడిటోరియం ఖిల్వత్ లో మంగళవారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మైనార్టీ యువతకు సంక్షేమ పథకాల అవగాహన సదస్సు కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్, చార్మినార్ శాసనసభ్యులు మీర్ జుల్ఫేఖర్ అలీ తో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు సరైన నైపుణ్యాభివృద్ధి అందినప్పుడే వివిధ రంగాలలో రాణించటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. మే 28న పెద్ద ఎత్తున లోన్ మేళాను ఏర్పాటు చేయటం జరుగుతుందని, అన్ని బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ అధికారులు అందుబాటులో ఉంటారని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నైపుణ్యాభివృద్ధిలో భాగంగా 1820 మందికి యువతకు వివిధ రంగాలలో శిక్షణ అందించనున్నట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ ఇండస్ట్రీస్, పీఎంఈజీఐ, ఎంఎస్ఎం ఈ అలాగే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీములపై జిల్లాలో యువతకు అనేక శిక్షణ సదస్సులు ఏర్పాటు చేసి వివిధ రంగాలలో రాణించేలా ప్రత్యేకత శిక్షణ అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ ప్రజా పాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుందని, సీఎం ఓవర్సీస్ పథకం కింద అర్హులైన 526 మంది అభ్యర్థులకు 20 లక్షల చొప్పున ఉన్నత చదువులకై అందించడం జరిగిందని అన్నారు. పోస్ట్ మాట్రిక్ స్కాలర్షిప్ కింద 40 963 మంది విద్యార్థులకు రూ. 3.90 కోట్లు అందించడం జరిగిందని, షాదీ ముబారక్ పథకం కింద 14 747 మందికి రూ. 147 కోట్లకు పైగా చెక్కులను అందించామ‌ని తెలిపారు. ముఖ్యంగా మైనార్టీ స్టడీస్ సర్కిల్ ద్వారా యువత కోచింగ్ అవకాశం కల్పించామన్నారు.

ఇందిరమ్మ మైనార్టీ యోజన పథకం కింద 1774 మంది లబ్ధిదారులు రేవంత్ అన్న సహారా మిస్కిన్ కోసం 60 మందికి అలాగే 12 వందల ఈ స్కూటర్లు లబ్ధిదారుల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో అత్యున్నత మార్కులు సాధించిన టాపర్ లను శాలువాలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేసి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ మహిళలకు 40 కుట్టుమిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇలియాస్ అహ్మద్, పరిశ్రమల శాఖ జిఎం పవన్ కుమార్, జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.

Next Story