ఉపాధికి మార్గాలు ఏటీసీ కేంద్రాలు: మంత్రి వివేక్

by Vemula.Srinu Prasad |

తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు...

ఉపాధికి మార్గాలు ఏటీసీ కేంద్రాలు: మంత్రి వివేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ల ద్వారా శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పోటీ ప్రపంచానికి తగ్గట్టు కొత్త కోర్సులను ప్రవేశపెట్టి.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్ నగరం మల్లేపల్లిలో ఉన్న మల్లేపల్లి, శాంతినగర్, విజయనగర్ కాలనీ, సనత్‌నగర్, ఖైరతాబాద్ ఏటీసీ కేంద్రాలను మంత్రి వివేక్ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ గురించి తెలుసుకున్నారు. ఏటీసీ కేంద్రాల్లో కలియ తిరిగి.. విద్యార్థులతో మాట్లాడారు. టాటా గ్రూప్ సహకారంతో ఆధునీకరించిన పరికరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఏటీసీల్లో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రూ.2వేల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వీటిల్లో 23 షార్ట్ టర్మ్, 6 లాంగ్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఏటీసీల అభివృద్ధి కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ఐటీఐలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ప్రత్యేక శ్రద్ధపెట్టి ఏటీసీలుగా మార్చామని చెప్పారు. ప్రస్తుతం 65 ఏటీసీలు ఉన్నాయని, రాబోయే సంవత్సరంలో మరో 54 ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. టామ్‌కామ్‌ ద్వారా తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్టు మంత్రి వివేక్ వివరించారు. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే కేంద్రాల్లో వ్యవసాయానికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని సూచించారు. ఈ ఏటీల్లో అడ్మిషన్ తీసుకొని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మొదటిదశ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈనెల 8 వరకు అవకాశం ఉందన్నారు.

Next Story