కాళేశ్వరంపై బీఆర్ఎస్‌వి పచ్చి అబద్ధాలు: మంత్రి వాకిటి శ్రీహరి

by Vemula.Srinu Prasad |

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పులపాలు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు....

కాళేశ్వరంపై బీఆర్ఎస్‌వి పచ్చి అబద్ధాలు: మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పులపాలు చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. మాటల గారడీతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందిని, పింక్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందదని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో గురువారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

100కుపైగా ఆర్జీలు

ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 100కుపైగా ఆర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, ఉద్యోగుల, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై వచ్చిన వినతి పత్రాలను పరిశీలించిన మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమం అనంతరం వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా తీసుకుని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక సంఖ్యలో ప్రజలు వినతులు అందజేశారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

నీళ్లు లేకపోయినా అత్యధిక దిగుబడులు

కాళేశ్వరం నీళ్లు లేకపోయినా తెలంగాణ రైతులు అత్యధిక దిగుబడులు సాధించారని, ప్రజలు వాస్తవాలను గుర్తించి ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నర ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు మూడు నెలలు అప్పగించమని చెప్పడం హాస్యాస్పదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ముఖాముఖి కమిటీ కన్వీనర్ మద్దుల గాల్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, కమిటీ సభ్యులు సంతోష్ ముదిరాజ్, హైమ తదితర నేతలు పాల్గొన్నారు

Next Story