Seethakka: మేడారం మాస్టర్ ప్లాన్.. వారం రోజుల్లో ప్లాన్ సిద్ధం చేస్తాం: మంత్రి సీతక్క

by Ramesh Naini |

మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనుల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Seethakka: మేడారం మాస్టర్ ప్లాన్.. వారం రోజుల్లో ప్లాన్ సిద్ధం చేస్తాం: మంత్రి సీతక్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారంలోని (Medaram Temple) సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనుల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శనివారం తెలంగాణ సచివాలయంలో అధికారులతో (Minister Seethakka) మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాబోయే మేడారం జాతరకు సంపూర్ణ ఏర్పాట్లు చేసేందుకు సమావేశం అయినట్లు తెలిపారు. ఆదివాసిల సంప్రదాయాలను, పూజారుల ఆలోచనలకు అనుగుణంగా మేడారం ఆధునీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశానుసారం భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని ఆధునీకరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ లో ఉన్న కారణంగా సమావేశానికి రాలేకపోయారని తెలిపారు. మంత్రి సురేఖ సూచన మేరకు మేడారం ఆధునీకరణ రాష్ట్రస్థాయి రెండో సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

సమ్మక్క సారలమ్మల ప్రధాన గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పరిసరాలను భక్తుల ఆకాంక్షల మేరకు, పూజారుల ఆలోచనల మేరకు విశాలంగా తీర్చిదిద్దుతామన్నారు. పూజారుల ఆలోచనలు కనుగుణంగానే మేడారం మాస్టర్ ప్లాన్ ఉంటుందని తెలిపారు. ఒక వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునీకరణ పనులకు సంబంధించి ప్లాన్‌ను సిద్ధం చేస్తామన్నారు. పూజారుల ఆమోదంతో పనులు ప్రారంభిస్తామని, పనుల ప్రతి దశలో వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. వచ్చే జాతర లోపు చేయాల్సిన పనులను ముందస్తుగా చేపడుతామన్నారు.

భక్తులు పుణ్య స్నానాలు చేసే జంపన్న వాగు అభివృద్ధి కోసం ఐదు కోట్లు మంజూరు చేశామని అన్నారు. జంపన్న వాగు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, పూజారులు, భక్తులకు, మీడియా ప్రతినిధులకు మరిన్ని వస్తువులు కల్పించే విధంగా గుడి చుట్టూ ఏర్పాట్లు చేస్తామన్నారు. మేడారంలో బస చేసే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కుంభమేళాలో భక్తులకు వసతులు కల్పించిన ఏజెన్సీ లను సంప్రదించి వారి సలహాలు తీసుకుంటామని వివరించారు.

Next Story