- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
సంక్షేమ పథకాల అమలులో హైదరాబాద్ జిల్లాను ముందంజలో ఉంచాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో: సంక్షేమ పథకాల అమలులో హైదరాబాద్ జిల్లాను ముందంజలో ఉంచాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన నిర్వహించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిని మంత్రి సమీక్షించారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు, వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం, 2బిహెచ్‌కే గృహాలు, రేషన్ కార్డులు ,సన్నబియ్యం పంపిణీ, విద్యా రంగం, రెసిడెన్షియల్ పాఠశాలలు , హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాల అమలును ఈ సందర్భంగా మంత్రి సమీక్ష చేశారు.
రవాణా , పట్టణ విస్తరణ , ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ చర్యలు, నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయడం, కొత్త బస్ మార్గాల ప్రారంభం ద్వారా కనెక్టివిటీ మెరుగుపరచడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం అమలు వంటి అంశాలను మంత్రి పరిశీలించారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సాహం, ప్రజా ప్రదేశాలలో ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు విషయాలపై అమలు తీరును మంత్రి సమీక్షించారు. ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ కవరేజ్, లబ్ధిదారుల పరిధి, ఆసుపత్రుల నెట్‌వర్క్, బస్తీ దవాఖానాలు ప్రజారోగ్య సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై సంబంధిత వైద్యాధికారులు ఆయనకు వివరించారు.
ఉపాధి , ఆర్థిక రంగాల పరంగా చేనేత, వస్త్ర పరిశ్రమలు, ఉపాధి , నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, స్లమ్ స్థాయి సమాఖ్యలపై సమీక్ష చేపట్టారు . పర్యావరణం , కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత, భూగర్భ జల మట్టాలు, ఉద్యానవనం, పశుపోషణ, పశుసంవర్ధక సేవలు, మత్స్య , పాడి అభివృద్ధి , ఉచిత విద్యుత్ 200 యూనిట్ల సరఫరా, ప్రభుత్వ భూముల సంరక్షణ, మీ-సేవా కేంద్రాల ద్వారా సులభమైన పాలన, సేవల అందుబాటు, అగ్నిమాపక శాఖల సర్వీస్, బాల కార్మికులు, భిక్షాటన, న్యాయ కేసుల పరిష్కారం , ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అంశాలపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగర స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక విధానంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో జనాభా వృద్ధి, ఉపాధి కోసం వలసలు, సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకొని విద్య, ఆరోగ్యం, గృహాలు, రవాణా, భద్రత , ప్రజాసేవలను అధికారులు సమన్వయంతో కలిసి అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని , క్రీడా కారులకు ప్రత్యేక తర్ఫీదు అందించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో కలసి పనిచేసి అర్హులైన వారికి పథకాలను అందించాలని పొన్నం సూచించారు . ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రోడ్ సేఫ్టీ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్( లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి, డి ఆర్ వో వెంకటాచారి, సిపిఓ డాక్టర్ సురేందర్, జిల్లా సంక్షేమ అధికారులు జి ఆశన్న, అక్కేశ్వరరావు, ఇలియాస్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, కోటాజి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






