- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత కవి దాశరథి: మంత్రి జూపల్లి
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

దిశ, రవీంద్ర భారతి: తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి సభాధ్యక్షత వహించగా, తెలంగాణ భాషా–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మహాకవి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ రాసిన "సాహిత్యం పాటల పూదోట" అందెల సవ్వడి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ఆత్మను, ప్రజల ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత కవి అని కొనియాడారు. ఆయన సాహిత్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మానవతా విలువల పరిరక్షణకు...
సభాధ్యక్షులు డా. బాలాచారి మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను పద్యంగా పలికించి నిజాం నిరంకుశ పాలనకు అక్షరాలతో ఎదురొడ్డి నిలిచిన మహాకవి దాశరథి సాహిత్యం నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అనే దాశరథి నినాదం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, దాశరథి జీవితం, సాహిత్యం సమసమాజ నిర్మాణానికి, మానవతా విలువల పరిరక్షణకు అంకితమైందని పేర్కొన్నారు. దాశరథి కుమార్తె ఇందిరా మాట్లాడుతూ, మహాకవి సాహిత్య వారసత్వాన్ని యువతకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సభ సమన్వయకర్త బడే సాబ్, ప్రముఖ కవులు అమ్మంగి వేణుగోపాల్, గంటా మనోహర్ రెడ్డి, సంఘన భట్ల నరసయ్య రామకృష్ణ చంద్రమౌళి తదితరులు పాల్గొని దాశరథి సాహిత్య వైశిష్ట్యాన్ని వివరించారు.






