మైనర్ డ్రైవింగ్‌పై రూ. 25వేల జరిమానా, మూడేళ్ల జైలు

by Vemula.Srinu Prasad |

మైనర్ డ్రైవింగ్ కేసుల్లో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబరితి అన్ని జిల్లాల రవాణా అధికారులను ఆదేశించారు...

మైనర్ డ్రైవింగ్‌పై రూ. 25వేల జరిమానా, మూడేళ్ల జైలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనర్ డ్రైవింగ్ కేసుల్లో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబరితి అన్ని జిల్లాల రవాణా అధికారులను ఆదేశించారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేవలం వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, వారి తల్లిదండ్రులు లేదా వాహన యజమానికి కోర్టు ద్వారా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే రూ.25వేల జరిమానా విధిస్తారు. ఇందుకోసం సదరు యజమాని లేదా సంరక్షకుడిపై కోర్టులో చట్టపరమైన విచారణ జరపాలని చెకింగ్ అధికారులను రవాణా శాఖ ఆదేశించింది.

తల్లిదండ్రుల అనుమతి ఉన్నట్లే లెక్క...

మైనర్ చేతికి వాహనం దొరికిందంటే.. అది తల్లిదండ్రులు లేదా వాహన యజమాని సమ్మతి తోనే ఇచ్చి ఉంటారని కోర్టు ప్రాథమికంగా భావిస్తుంది. ఒకవేళ తమకు తెలియకుండా లేదా తాము వారించినా మైనర్ వాహనం తీసుకెళ్లాడని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు లేదా యజమానులపైనే ఉంటుంది.

స్పాట్ లోనే ఆర్సీ సీజ్...

తనిఖీల సమయంలో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే, చెకింగ్ అధికారులు వెంటనే సదరు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) ని అక్కడికక్కడే సీజ్ చేస్తారు. ఆ తర్వాత సదరు మైనర్ పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా వంటి పూర్తి గుర్తింపు వివరాలను సేకరించి, ఆర్సీతో పాటు జిల్లా రవాణా అధికారికి (డీటీఓ) పంపుతారు.

లైసెన్స్ రాకుండా ఆన్‌లైన్ డేటాబేస్ బ్లాక్...

మైనర్లు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ లర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కానీ పొందకుండా రవాణా శాఖ ఐటీ టీమ్ ప్రత్యేక ఆన్‌లైన్ నిబంధనను రూపొందిస్తోంది. పట్టుబడిన మైనర్ల వివరాలను నేరుగా రవాణా శాఖ డేటాబేస్‌లో నమోదు చేసి బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. దీనివల్ల వారు 25 ఏళ్లు వచ్చేలోపు ఆన్‌లైన్‌లో ఎక్కడా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అధికారులు అందరూ అత్యంత కఠినంగా అమలు చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని రవాణా కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర డీజీపీకి కూడా పంపించారు.

Next Story