ప్రేమ వ్యవహారం విషాదాంతం.. మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్

by Kodari Anjali |

ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసిన మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో సైదాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.

ప్రేమ వ్యవహారం విషాదాంతం.. మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్ట్
X

దిశ, చంపాపేట్: ప్రేమ వ్యవహారం విషాదాంతానికి దారితీసిన మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో సైదాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాలికను మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీకి చెందిన అమూల్య శ్రీ (17) ఈ ఏడాది మే 28న తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బాబాయ్ అమ్గోత్ చందర్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాలికకు మేగావత్ నారాయణ అలియాస్ మహేష్‌తో ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడితో సంబంధాలు కొనసాగించవద్దని మహేష్ కుటుంబ సభ్యులు బాలికను హెచ్చరించినట్లు, బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు పరిశీలించారు. ఈ పరిణామాల కారణంగా బాలిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

పోస్టుమార్టం నివేదికలో ఉరివేసుకోవడం వల్లే మృతి..

కేసులో నిందితులైన మేగావత్ నారాయణ అలియాస్ మహేష్ (ఏ-1), మేగావత్ వాల్‌సింగ్ (ఏ-2)లను మే 30న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మరో నిందితురాలు మేగావత్ సుజాత (ఏ-3) పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా మృతురాలు రాసినట్లు భావిస్తున్న సూసైడ్ లెటర్, చేతిరాత నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు. అలాగే మృతురాలు, నిందితులకు సంబంధించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సాంకేతిక విశ్లేషణ చేపట్టారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో ఉరివేసుకోవడం వల్లే మృతి సంభవించినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక ఆధారాలు అందిన తర్వాత కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 107, 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు.

Next Story