- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సకల సౌకర్యాలకు నిలయాలు.. రిటైర్మెంట్ హోమ్స్..!
మలివయసులో సంతోషంగా గడిపేందుకు లివింగ్ కమ్యూనిటీలల్లో ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. పలు సంస్థలు సీనియర్ సిటిజన్స్ కోసం వినోద సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ, భద్రత వంటి ఏర్పాట్లతో కూడిన గృహ సముదాయాలను అందిస్తున్నాయి.

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు అందుబాటులోకి వచ్చాయి. వయస్సు మీద పడిన కారణంగా ఏ పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, తోడు లేనిదే ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోవడం, చివరకు మందులు వేసుకోవడానికి కూడా సహాయకుల అవసరం ఏర్పడుతోంది. ఇలాంటప్పుడు సంపన్నుల ఇండ్లలో పనివాళ్లు ఉంటున్నప్పటికీ.. సేవల పరంగా లోపం ఉంటోందని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి వారికోసమే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు లివింగ్ కమ్యూనిటీలు, రిటైర్మెంట్ హోమ్స్ అందుబాటులోకి తెచ్చాయి.
మలివయసులో సంతోషంగా గడిపేందుకు లివింగ్ కమ్యూనిటీలల్లో ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా సాకేత్ ప్రణామం, అపర్ణ జెనన్, అద్వయిత్ రిటైర్మెంట్ హోమ్స్ వంటి సంస్థలు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిలో వినోద సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ, భద్రత, నిర్వహణ మద్దతు, సామాజిక కార్యకలాపాలతో కూడిన ప్రశాంతమైన జీవనశైలిని అందిస్తున్నాయి. వీటిలో వృద్ధులు స్వతంత్రంగా, సౌకర్యవంతంగా జీవించే సౌలభ్యం ఉండడంతో చాలా మంది దృష్టి వీటివైపు మళ్లుతోంది.
సౌకర్యాలు..
ఏజ్ బార్ అయిన తర్వాత స్వతంత్ర జీవనం కోరుకునేవారి కోసం పలు సంస్థలు గేటెడ్ కమ్యూనిటీలలో లగ్జరీ లివింగ్‌లను అందిస్తున్నాయి. వీటి నిర్వహణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా జీవించే అవకాశం కల్పిస్తున్నాయి. వైద్యుల సంరక్షణ, నర్సింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాకుండా జిమ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్, స్పా, యోగా రూమ్, తోటలు, క్లబ్ హౌస్‌లు, సామాజిక కార్యకలాపాలు కోరుకునే వారు తోటి వారితో కలిసి ఉండేందుకు, వినోద కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నాయి. భోజనం, శుభ్రత, ఇతర సహాయక సేవలు కూడా అందిస్తున్నాయి. వీటి కోసం జస్ట్ డయల్, నో బ్రోకర్, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ వంటి వెబ్ సైట్‌లలో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. 24 గంటల భద్రత, వైద్య సహాయం, హౌస్ కీపింగ్, లాండ్రీ సేవలు, వినోద కార్యకలాపాలు ఇతర సేవలు వంటి అనేక రకాల సౌకర్యాలను అందిస్తున్నాయి. జిమ్నాసియం, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, నివాసితులకు వైద్య సహాయం, కౌన్సెలింగ్ సేవలను అందించడానికి ప్రత్యేక నిపుణుల బృందం రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది.
ప్రశాంతత కోసం..
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపర్ణ జెనన్ సీనియర్ సిటిజన్స్ కోసం పచ్చని పరిసరాలు, స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను అందిస్తోంది. మేడ్చల్ ప్రాంతంలో అద్వైత్ రిటైర్మెంట్ హోమ్స్ 3, 4 బీహెచ్‌కే విల్లాలు, ఫ్లాట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక అనే టాక్ ఉంది. ఇక పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్.. స్వతంత్ర జీవనం, ఆరోగ్య సంరక్షణ కోరుకునే వారికి నిపుణుల పర్యవేక్షణతో కూడిన విల్లాలు అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కుటుంబాన్ని తలింపించేలా వాతావరణం ఉండడంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. కూకట్‌పల్లిలో అతుల్య సీనియర్ కేర్ సంస్థ అసిస్టెడ్ లివింగ్ సదుపాయాలతో విలాసవంతమైన వసతులలో, ఆరోగ్య సంరక్షణ, సామాజిక కార్యకలాపాలు కోరుకునే వారిని ఆకర్షిస్తోంది.






