నకిలీ పత్రాలతో భూ కబ్జా కేసు.. మరో నిందితుడి అరెస్టు

by Kodari Anjali |

నకిలీ పత్రాలు సృష్టించి వృద్ధ మహిళ ఆస్తిని కాజేసేందుకు యత్నించిన కేసులో మరో నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ పత్రాలతో భూ కబ్జా కేసు.. మరో నిందితుడి అరెస్టు
X

దిశ, సికింద్రాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి వృద్ధ మహిళ ఆస్తిని కాజేసేందుకు యత్నించిన కేసులో మరో నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ విక్రయ ఒప్పందానికి తెలిసీ సాక్షిగా సంతకం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండి మేడిబావిలోని ఇంటి యజమాని, ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎస్‌.వి. సులోచన వాసుదేవన్ (82) ఫిర్యాదు మేరకు 2024లో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనారోగ్యంతో హైదరాబాద్‌కు దూరంగా ఉన్న సమయంలో ఆమె అద్దెదారు అల్లబోయిన పద్మావతి అలియాస్ పద్మరాజ్యం, ఆమె సహచరులతో కలిసి 2017 ఫిబ్రవరి 2 తేదీతో నకిలీ అమ్మకపు ఒప్పందం సృష్టించి ఇంటిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నకిలీ పత్రంపై సాక్షిగా సంతకం చేసినట్లు..

అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన బాధితురాలు, ఆమె కుమారుడిని ఇంట్లోకి రానీయకుండా బెదిరించినట్లు ఆరోపించారు. దర్యాప్తులో నిందితురాలి సోదరుడు రాజం ఇలేష్ యాదవ్ (61) నకిలీ అమ్మకపు ఒప్పందంపై సాక్షిగా సంతకం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో సాక్షి మొలమ్మ అలియాస్ కలమ్మ 2023లో మరణించినట్లు విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజం ఇలేష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, పద్మావతి, ఆమె కుమారుడి అభ్యర్థన మేరకు నకిలీ పత్రంపై సాక్షిగా సంతకం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఎస్‌హెచ్‌వో వి. రామకృష్ణ మాట్లాడుతూ, ఇతరుల ఆస్తులను కాజేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం, వాటికి సాక్షులుగా వ్యవహరించడం లేదా వినియోగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి నేరాలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

Next Story