- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎఫ్టీఎల్ నిర్ధారణకు యాప్ : హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్
నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తి అయితే చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్టవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తి అయితే చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్టవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తున్న వేళ ప్రజల అభ్యంతరాలను కూడా స్వీకరించాలన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ఉద్దేశించి రూపొందిస్తున్న లేక్ ఎన్యూమరేషన్ యాప్ లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలమ్‌ను పెట్టాలన్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఇదే అంశంపై ఎక్కువ మొత్తంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌గారు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ప్రాధాన్యతను వివరించారు. చెరువుల్లో ఓ వైపు నుంచి మట్టిని నింపడంతోపాటు మురుగు నీరు నిరంతరంగా వచ్చి చేరడంతో ఎఫ్‌టీఎల్ పరిధులు మారిపోతున్న నేపథ్యంలో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ వేగంగా జరగాల్సి ఉందన్నారు. గ్రామ, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు.. ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరుగుతోందన్నారు. ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని కూడా వేసి.. ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఫిర్యాదుదారులకు వివరించారు. అలాగే పలు కాలనీల మధ్య రహదారులకు ఆటంకాలు కలిగించడం, పాత లే ఔట్ల హద్దులను పట్టించుకోకుండా కబ్జా చేయడం, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్మేయడం వంటి ఫిర్యాదులు అందాయి. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 57 ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు నేరుగా స్వీకరించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా:
-మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లా కుత్‌బుల్లాపూర్ మండలం మెట్టుకానిగూడ, గాజులరామారం గ్రామంలో సర్వే నంబరు 161లో ఉన్న పార్కు స్థలంతో పాటు.. ఆ పక్కనే ప్రభుత్వస్థలాన్ని కూడా కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
-కాప్రా చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ అయ్యిందని.. ఫెన్సింగ్‌ను తొలగించి కొంతమంది అక్కడ చెరువులోపలకి వచ్చి కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
-మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట లో హైరైజ్ పీవీఆర్ మెడోస్ వాళ్లు ఇతర కాలనీలకు వెళ్లే మార్గాలను మూసేశారని మల్లంపేట నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- పటాన్‌చెరువులో తిమ్మక్క చెరువుకు నీరందించే పెద్దవాగును ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసిందని.. 30 మీటర్ల వెడల్పువాగుకు తోడు ఇరువైపుల 9 మీటర్ల చొప్పున బఫర్ ఉండాల్సిన విస్తీర్ణం కుంచించుకుపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
-ఉప్పల్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతిపురి గ్రామంలో 3 ఎకరాల సమాధుల భూమి తమదంటూ పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని మరో ఫిర్యాదు అందింది.






