అధికారుల మధ్య కొరవడిన సమన్వయం..

by I. Sairam |

జలమండలి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలోని పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

అధికారుల మధ్య కొరవడిన సమన్వయం..
X

దిశ, కార్వాన్: జలమండలి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలోని పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినబడుతున్నాయి. సంవత్సరం నుంచి ఫిర్యాదులు చేసినా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

సమస్యల విలయతాండవం..

జలమండలి అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. డ్రైనేజీ,వాటర్ పైప్ లైన్ పనుల విషయంలో జాప్యం జరగడంతో నాంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఓ వైపు మురుగు నీరు, మరో వైపు పగిలిన పైప్ లైన్లు, శిథిలావస్థకు చేరడంతో నీళ్లు సరిగ్గా సరఫరా కాకపోవడం. స్థానికులు సంవత్సరంగా డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ విషయంలో ప్రపోజల్ పెట్టమని కోరితే పెట్టడంలో జలమండలి అధికారులు జాప్యం చేస్తున్నారనే అపవాది మూటకట్టుకున్నారు. ఒకరి పై ఒకరు నెట్టివేస్తూ కాలయాపన చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

పలు మార్లు ఫిర్యాదులు చేసిన తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆసిఫ్ నగర్ డివిజన్ లోని న్యూ ఇందిరా నగర్ లో ‘సమస్యల వలయంలో ఇందిరానగర్’ శీర్షికన ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. అయితే అధికారులు అప్పటి మట్టుకు వచ్చి సమస్యలపై పరిశీలించి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ జలమండలి అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రపోజల్ పెట్టాలని పలుమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటి మట్టుకు జలమండలి మేనేజర్ వచ్చి పనులపై ప్రపోజల్ పెడతానని హామీ ఇచ్చారు. అయితే స్థానికులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.

అధికారుల మధ్య సమన్వయ లోపం..

అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంలా మారింది. అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకోవాల్సిన అధికారులు కుంటి సాకులు చెప్పడంతో మండి పడుతున్నారు. ఓ వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారుల పనితీరుతో ప్రభుత్వానికి తీరని మచ్చ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ కల్పించుకొని ఓ సారి అధికారుల పనితీరు చూడాలని కోరుతున్నారు. జలమండలి సీజీఎం వినోద్ భార్గవ్ ను ప్రపోజల్ విషయంలో వివరణ అడగగా.. కింది స్థాయి సిబ్బందిపై నెట్టి వేసి చేతులు దులుపుకున్నారు. జనరల్ మేనేజర్ శ్రీను నాయక్ ను వివరణ అడగగా.. మేనేజర్ సాయి రెడ్డిపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఇదే విషయంపై చివరగా జనరల్ మేనేజర్ సాయి రెడ్డిని వివరణ అడగగా.. తాను పై అధికారుల పై నెట్టేపి తప్పించుకున్నారు.

Next Story