కిల్లర్ థ్రెడ్- ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజా

by I. Sairam |

సంక్రాంతి అంటే పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గాలిపటాలు (పతంగులు) గుర్తుకొస్తాయి.

కిల్లర్ థ్రెడ్- ప్రాణాలు హరిస్తున్న చైనా మాంజా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: సంక్రాంతి అంటే పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గాలిపటాలు (పతంగులు) గుర్తుకొస్తాయి. పండగకు కొన్ని రోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో పతంగులను ఎగరేసేందుకు కాటన్‌ మాంజాను వాడేవారు. క్రమేణా మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా(సగ్గుబియ్యం), గంధకం, రంగులు వేసి తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ప్రమాదకరమైన చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి . రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. దీనిని అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించే అవకాశమున్నా ఇప్పటికీ నగర మార్కెట్‌లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని పంజేషా, ధూల్‌పేట్‌తో పాటు పతంగులు అమ్మే వివిధ ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు అప్పుడే మొదలయ్యాయి. అయితే ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమ వద్ద లేదని చెప్పడం గమనార్హం.

రహస్యంగా విక్రయాలు..

జీహెచ్ఎంసీలో చైనా మాంజా రహాస్యంగా విక్రయిస్తున్నారు . గతంలో చైనా మాంజా ముంబైతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అయ్యేది. ప్రభుత్వ నిషేధంతో దీన్ని దిగుమతికి వ్యాపారులు జంకుతున్నా రహస్యంగా తెచ్చి విక్రయిస్తున్నారు. చైనా మాంజా విక్రయం లాభసాటిగా ఉండడంతో పాటు బలంగా ఉంటుందన్న అభిప్రాయంతో చిన్నారులు నైలాన్‌ దారంతోనే పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని, పక్షుల ప్రాణాలను కాపాడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

గాజుపొడితో గాయాలు..

చైనా మాంజాను గాజుపొడితో కలిపి తయారు చేస్తారు. పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి దీనిని వినియోగిస్తున్నారు. ఈ మాంజా ప్లాస్టిక్‌ దారానికి గాజుపొడి అద్ది తయారు చేస్తారు. అయితే మాంజాతో గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో చెట్లకు, విద్యుత్‌ స్తంబాలకు పతంగులతో పాటు చైనా మాంజా చిక్కుకోవడంతో మాంజాకు తగిలే పక్షులు, జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. గతంలో మనుషులు కూడా ప్రమాదాల బారిన పడడం గమనార్హం.

పట్టుబడుతున్న కోట్లాది రూపాయల విలువైన చైనా మాంజా..

సంక్రాతి పండుగకు రోజుల గడువు మిగిలి ఉండగా.. అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల విలువజేసే చైనా మాంజా పట్టుబడుతుండడం పరిస్థితికి అద్దం పడుతున్నది. తాజాగా కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ నగర పోలీసులు 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేశారు. నిషేధిత చైనీస్ మాంజా బాబిన్‌లు మొత్తం 6,226 స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.1,24,52,000 ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా సౌత్, వెస్ట్ జోన్‌లలో అధిక కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 46 మంది చైనా మాంజా అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం రూ 65,30,000 విలువైన 3,265 బాబిన్‌లు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్టు చేసి వారి నుండి రూ రూ 37,22,000 విలువైన 1,861 బాబిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 29 మందిపై 18 కేసులు నమోదు చేసి రూ.6,02,000 విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ జోన్‌లో తొమ్మిది కేసుల్లో 10 అరెస్టులు నమోదయ్యాయి. సెంట్రల్, నార్త్, వెస్ట్ జోన్‌లలో వరుసగా ఆరు, ఐదు, నాలుగు కేసులు నమోదయ్యాయి . ఈ దాడుల్లో అదనపు సీపీ (నేరాలు, సిట్) ఎం శ్రీనివాసులు, డీసీపీలు ఖరే కిరణ్ ప్రభాకర్, జీ చంద్ర మోహన్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు డీసీపీ (టాస్క్ ఫోర్స్) అందే శ్రీనివాస్ రావు పాల్గొనగా.. ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులు అందజేశారు .

9490616555కు కాల్ చేయండి : సీపీ సజ్జనార్

చైనా మాంజా విక్రయిస్తున్న వారి గురించి తెలిస్తే 94906 16555 నెంబర్ లేదా 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు . ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే ఆనందంగా గాలిపటాలు ఎగురవేసే పండుగ అని, వేడుకలు ప్రాణాలకు ముప్పు కలిగించకూడదని అన్నారు. చైనీస్ మాంజా మానవులకు, పక్షులకు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నందున ప్రభుత్వం దానిపై పూర్తి నిషేధం విధించిందని ఆయన పునరుద్ఘాటించారు. నిషేధం ఉన్నప్పటికీ అక్రమ అమ్మకాలు రహస్యంగా జరుగుతున్నాయని, చైనీస్ మాంజా అమ్మకాలు, నిల్వ చేయడం లేదా రవాణా చేయడాన్ని ఎవరైనా గుర్తిస్తే తక్షణ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది వ్యాపారులు ఆన్‌లైన్ లో విక్రయాలు చేపడుతున్నారని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాపై 24 గంటలూ నిఘా ఉంచామన్నారు. చైనీస్ మాంజా ఆన్‌లైన్ అమ్మకం, కొనుగోలులో పాల్గొన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story