డబ్ల్యూఆర్-1, 2ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి: ఎలక్ట్రికల్ జేఏసీ డిమాండ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు కొన్ని జిల్లాలకే పరిమితమైన డబ్ల్యూఆర్-1, డబ్ల్యూఆర్-2 (వైరింగ్ రెగ్యులేషన్స్) నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

డబ్ల్యూఆర్-1, 2ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి: ఎలక్ట్రికల్ జేఏసీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు కొన్ని జిల్లాలకే పరిమితమైన డబ్ల్యూఆర్-1, డబ్ల్యూఆర్-2 (వైరింగ్ రెగ్యులేషన్స్) నిబంధనలను రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రామంతపూర్‌లో తెలంగాణ ఎలక్ట్రికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యుత్ శాస్త్రవేత్త నికోలా టెస్లా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన నక్క యాదగిరి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ తప్పనిసరిగా ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా వైర్ మెన్ పర్మిట్‌తో పాటు సూపర్వైజర్ పర్మిట్ కూడా తీసుకోవాలని సూచించారు. సరైన లైసెన్సులు, నిబంధనల అమలు ద్వారానే క్షేత్రస్థాయిలో విద్యుత్ ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎలక్ట్రిషియన్ల పని రేట్ల విషయంలో గానీ, ఇతర వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురైనా జేఏసీ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తాము కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కమిటీ తీర్మానించింది.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ మెంబర్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేమాల బెనర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ ఉదయ్ భాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామల శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు బడే యాదగిరి, వి. సత్యనారాయణ, కాశీ నాయుడు, శ్రీనివాస్ నేత, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story