నీలోఫర్ లో పురుగుల అన్నం.. నీళ్ల చారు

by Elthuri vijay kumar |

గరంలోని ప్రముఖ నీలోఫర్ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు ఆరోగ్య పరిరక్షణ కోసం సరైన డైట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అండతో నాసిరకం భోజనం సరఫరా అవుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నీలోఫర్ లో పురుగుల అన్నం.. నీళ్ల చారు
X

నీలోఫర్ లో పురుగుల అన్నం.. నీళ్ల చారు

రోగులకు నాసిరకం ఆహారంతో తప్పని తిప్పలు

అధికారుల అండతో రెచ్చిపోతున్న కాంట్రాక్టర్లు

దిశ, కార్వాన్ : నగరంలోని ప్రముఖ నీలోఫర్ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగులకు ఆరోగ్య పరిరక్షణ కోసం సరైన డైట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అండతో నాసిరకం భోజనం సరఫరా అవుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలోని పాత భవనం జనరల్ వార్డులో రోగులకు అందించిన అన్నంలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. రోగులకు ఇచ్చే సాంబారు నీటిలా ఉండటం, గుడ్డు, పాలు, అరటి పండ్లు వంటి పోషకాహారం సరిపడా ఇవ్వకపోవడం, ఆహారంలో తరచూ కోతలు విధించడం వంటి అంశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లు లక్షల్లో బిల్లులు వేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రోగుల కోసం కొనుగోలు చేసే నిత్యావసర సరుకులు, సరఫరాలను కొందరు కాంట్రాక్టర్లు తమ ఇళ్లకు తరలిస్తున్నారని ఆసుపత్రి వర్గాల నుండి సమాచారం వెలువడింది.

కాంట్రాక్టర్ల ఆధిపత్యం..

గత సంవత్సరం నవంబర్‌లో డైట్ కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ కొత్త టెండర్లు పిలవకపోవడంతో అదే కాంట్రాక్టర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. టెండర్లలో జాప్యం కావడం వెనుక అవకతవకలు దాగి ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది వైద్యాధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్లు తీసుకుంటూ వారికి అండగా ఉంటున్నారని రోగుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో నాణ్యతలేని ఆహారం సరఫరా అవుతున్నా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబడడం లేదు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, అక్కడ అందిస్తున్న నాసిరకం భోజనం కారణంగా కొత్త రోగాలు తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. తక్షణమే నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story