డిబేట్‌లో సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు... కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీవీ చర్చా వేదికలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ....

డిబేట్‌లో సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు...  కేసు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీవీ చర్చా వేదికలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరుస్తూ తీవ్ర పదజాలంతో దూషించిన వ్యవహారంలో నాగార్జున యాదవ్‌తో పాటు, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్‌ఆర్ తదితరులపై హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను నివాసం నుంచి తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము తెలంగాణ పోలీసులమని తెలిపిన సిబ్బంది, అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో అందిస్తామని చెప్పి ఆయనను తీసుకువెళ్లారు.

జొమాటో,స్విగ్గీ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడు..

జులై 10న సాక్షి ఛానెల్‌లో జరిగిన ఒక లైవ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ పాల్గొని.. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని పదేపదే జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ సంబోధించారు. భారతదేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యాడని, ఆయనకు కనీసం ఒక ప్రభుత్వ జీవో పూర్తి రూపం కూడా తెలియదని, అసలు ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా పనికిరాడంటూ ఏకవచనంతో తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌తో ముఖ్యమంత్రిని పోల్చడం ద్వారా ఆ డెలివరీ బాయ్స్ విలువను తాను తగ్గిస్తున్నానని, అందుకు వారికి క్షమాపణలు చెబుతున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇంతటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, యాంకర్ కేఎస్‌ఆర్ ఆయన్ను అడ్డుకోకుండా ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించి ఆ వ్యాఖ్యలు చేసేందుకు అవకాశం ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు.

వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలి..

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా వ్యవహరించారని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయవాది, టీపీసీసీ మీడియా విభాగానికి చెందిన కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన బేగంబజార్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. శ్రీశైలం.. నాగార్జున యాదవ్, యాంకర్ కేఎస్‌ఆర్, సాక్షి ఛానల్ అడ్మిన్లు ఆపరేటర్లు, అలాగే సదరు వివాదాస్పద వీడియోను విస్తృతంగా ప్రచారం చేసిన 1227 2222 అనే ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకులపై పలు సెక్షన్ల ల కింద కేసు నమోదు చేశారు. నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానానికి పోలీసులు ఈ కేసు వివరాలను సమర్పించారు. ఈ వీడియోను వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేలా యూట్యూబ్, ఫేస్‌బుక్ సంస్థలను ఆదేశించాలని నిర్ణయించారు. ఐటీ నిబంధనల ప్రకారం ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన వారి ఐపీ లాగ్‌లు, ఇతర సాంకేతిక వివరాలను భద్రపరచాలని కోరుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story