- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ ఆక్రమణలకు ఆధ్యులు వారే.. పట్టించుకోని హైడ్రా
సికింద్రాబాద్ అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. బేగంపేట సర్కిల్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి.

దిశ. బేగంపేట : సికింద్రాబాద్ అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. గతంలో బేగంపేట సర్కిల్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నాయి. కొంత మంది అధికారుల సహకారం, మరికొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అక్రమ నిర్మాణాల జోరు పెరిగిపోతుంది. ఇటీవల అక్రమ నిర్మాణాల గురించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసినా హైడ్రా కూడా ఆక్రమ నిర్మాణాల గురించి అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇంకా విశేషం ఏమిటంటే.. గతంలో హైడ్రా ఏవైతే అక్రమ నిర్మాణాలని కూల్చివేశారో వాటిని తిరిగి పునర్నిర్మిస్తున్నా ఎవరూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
గాల్లో మేడలు.. ప్రాణాలకు గ్యారెంటీ లేదు..
సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట్, బేగంపేట్, మోండా మార్కెట్ తదితర డివిజన్లలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొద్ది నెలల నుంచి ఉన్నతాధికారులందరూ డివిజన్ల పునర్విభజన, జీహెచ్ఎంసీ ఎన్నికల పనులతో బిజీగా ఉండడంతో కింది స్థాయి అధికారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది. మోండా డివిజన్లోని శివాజీనగర్ లో ఓ భవన యజమాని రెండంతస్తులకు అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నాడు. సెట్ బ్యాక్ లు కానీ, మరే ఇతర నిబంధనలు అసలు పట్టించుకోకపోయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ భవనం యజమానులు ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి అధికారులను బెధిరిస్తున్నారనే విమర్శలున్నా మామూళ్లు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ డీలిమిటేషన్స్ పై ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఎలా ప్రోత్సహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్రజలకు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలున్నాయి. నల్లగుట్ట మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఏకంగా పురాతన భవనంపై పెద్ద షెడ్డును నిర్మించాడు. కళాసీగూడలో ఓ ప్రజాప్రతినిధి అండతో ఓ వ్యక్తి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారు.
హైడ్రా కూల్చిన స్థానంలో మళ్లీ నిర్మాణం..
సికింద్రాబాద్ మంజూ థియేటర్ వెనుక వైపు గత ఏడాది క్రితం హైడ్రా అధికారులు ఓ భవనాన్ని కూల్చివేశారు. ఈ భవనం అక్రమ నిర్మాణం అని చెప్పి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని స్లాబులు కూలగొట్టారు. కానీ హైడ్రా అధికారులతో ఏ ఒప్పందం జరిగిందో తెలియదు.. కానీ మళ్లీ అదే భవనం పునర్నిర్మాణం జోరుగా సాగుతున్నది. ఆటు హైడ్రా, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడం చూస్తే ఎవరికి ఎంత వాటాలు ముట్టాయో అర్ధం అవుతుంది.






