- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్కుల ఆక్రమణలు, కబ్జాలపై నిఘా పెట్టిన హైడ్రా
చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, లేఅవుట్లలోని రోడ్ల కబ్జా వంటి వాటిపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించిన హైడ్రా.. పార్కుల పరిరక్షణపై ఫోకస్ పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, లేఅవుట్లలోని రోడ్ల కబ్జా వంటి వాటిపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించిన హైడ్రా.. పార్కుల పరిరక్షణపై ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, సరస్సులు, నాలాల ఆక్రమణలను తొలగించి భూములను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యం. ఇప్పటికే చెరువులు, నాలాలు, పార్కు స్థలాలను కాపాడే పనిలో బిజీగా ఉన్న హైడ్రా.. ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మొత్తం పార్కులు ఎన్ని? వాటి విస్తీర్ణంపై హైడ్రా దృష్టి పెట్టింది. అసలు ఎన్ని పార్కులు ఉన్నాయనే దానిపై హైడ్రా లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. అలాగే గతంలో పార్కుల విస్తీర్ణం ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంత ఉందనే వివరాలను సేకరించనున్నారు.
ఎక్కడైనా ఆక్రమణలకు గురైతే, వాటిని గుర్తించి కాపాడేందుకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా విస్తీర్ణం, జరిగిన ఆక్రమణలను గుర్తించనున్నారు. రోజురోజుకు పార్కుల ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడం కూడా కష్టంగానే మారింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే గతంలో పార్కులు పూర్తి ఆక్రమణలకు గురయ్యే అవకాశముంది.
ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా..
హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో పార్కుల ఆక్రమణలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా లేఅవుట్లలో పార్కుల ఆక్రమణల సంఖ్య అధిక మొత్తంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లేఅవుట్‌లలో కచ్చితంగా పార్కుకు స్థలం కేటాయించాల్సిందే. అయితే కేటాయించడమే తప్పా ఎక్కడా స్థలం చూపించడం లేదని, పార్క్ స్థలాన్ని సైతం కబ్జా చేస్తున్నారని పలు కాలనీలకు చెందిన ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు కొన్నేళ్ల తర్వాత ఆ పార్కుల స్థలాలకు డాక్యుమెంట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా ఇప్పటికే హైడ్రా చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇక కాలనీల్లో లోకల్ లీడర్లు పార్కుల స్థలాలను దర్జాగా కబ్జాలు చేస్తున్నారు.
ఇలా అనేక ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఓఆర్ఆర్ పరిధిలో పార్కులపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఆక్రమణల విషయంలో పేదలకు ఇబ్బందులు కలిగించకుండా హైడ్రా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీంతోపాటు పాత లేఅవుట్లలో పార్క్ స్థలాలను కబ్జా చేసిన బడాబాబులపై ఫోకస్ పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ముందుగా వాటిని గుర్తించి పార్కుల సంఖ్య, విస్తీర్ణం వంటి అంశాలను సేకరించే పనిలో హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు.
ఓఆర్ఆర్ పరిధిలో..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో సుమారు రెండు వేలకు పైగానే పార్కులు ఉంటాయని అధికారుల అంచనా. హెచ్ఎండీఏకు సంబంధించిన పార్కులు 170 వరకు ఉన్నాయి. వీటిలో 70 పార్కులను హెచ్ఎండీఏ నిర్వహిస్తున్నది. వంద పార్కులను కాలనీ సంక్షేమ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇక చిన్న, మధ్యతరహా పార్కులు, లేఅవుట్లలో చూపించిన పార్కులు, పిల్లల కోసం కేటాయించిన పార్క్ స్థలాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 985 పార్కులున్నాయి.
ఇందులో 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, కాలనీల్లో పార్కులు ఉన్నాయి. అయితే వీటిని 1970 సర్వే ఆఫ్ ఇండియా టోపో గ్రాఫిక్ షీట్లు, రెవెన్యూ రికార్డులు, పాత శాటిలైట్ మ్యాప్ తో కూడా పోల్చి చూసి, పార్కుల అసలు విస్తీర్ణం మార్పులను స్పష్టంగా తెలుసుకోనున్నారు. ఈ విధంగా పార్కులను గుర్తించి సంరక్షించడం, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పార్కుల స్థలాలను గుర్తించి వెంటనే కంచె వేయాలని అధికారులు నిర్ణయించారు.






