- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ , హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్ల డ్రైవర్లు, పీఏలు, అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి.ముఖ్యంగా భవన నిర్మాణదారులు వీరి నుండి పడరాని పాట్లు పడుతున్నారు . కార్నొరేటర్ల పేరు చెప్పి అందిన కాడికి దండుకున్నారు . దీంతో పేద, మద్య తరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే భయాందోళనలకు గురౌతున్నారు . ఎప్పుడు ఎవరి నుండి బెదిరింపులు వస్తాయో , ఎవరొచ్చి పనులు ఆపిస్తారో తెలియని దుస్తితి నగర వ్యాప్తంగా నెలకొంది . వారు అడిగిందిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. లేకపోతే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి ఫోన్లు రావడం, నిర్మాణాల దగ్గరకు వచ్చి పనులు నిలిపివేయడం జరుగుతోంది . ఈ వ్వహారమంతా కార్పొరేటర్ల కనుసన్నలలోనే జరుగుతున్నా వారు తమకేమీ పట్టనట్లు , తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న నిర్మాణాల స్థాయిని బట్టి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకుని వారి అనుచరులు, పీఏలు షాడో కార్పొరేటర్ల అవతారమెత్తుతున్నారు . మరి కొంతమంది అధికారులతో లాలూచి పడి వసూళ్లకు తెగబడుతున్నారు.కొన్ని చోట్ల జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు కార్పొరేటర్లే తమ అనుచరులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. తిరిగి వారు రంగంలోకి దిగి సెటిల్ మెంట్లు చేస్తున్నారు. దీంతో వీరి అక్రమ వసూళ్ల దందా మూడు పువ్వులు , ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది .
ఎన్నికలకు నిధుల సమీకరణ...?
సుమారు మరో ఆరు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కార్పొరేటర్లు తమ అనుచరులతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే టాక్ జోరుగా వినబడుతోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకున్నట్లుగా తిరిగి ఎన్నికలలో పోటీ చేసేందుకు అయ్యే ఖర్చు కోసం నిర్మాణదారులను పిండేస్తున్నారు . స్థలంలో బోరు వేయడం, ముగ్గు పోయడం మొదలు కాగానే కార్పొరేటర్ల అనుచరుల కన్ను పడి వారు అడిగినంత ఇచ్చుకునేంత వరకు పనులు ముందుకు సాగని దుస్థితి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది . కొన్ని చోట్ల కార్పొరేటర్లే నేరుగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని, అటువైపు కన్నెత్తి చూడొద్దని టౌన్ ప్లానింగ్ అధికారులకు హుకుం జారీ చేస్తుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు . ఈ నేపథ్యంలో ఇటీవల గోషామహల్ సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు, ఓ కార్పొరేటర్ గొడవ పడి పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. చివరకు న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులపై కేసు నమోదు చేశారు . ఇలాంటి పరిస్థితే నగరంలో చాలా నివ్వురు గప్పిన నిప్పులా ఉంది. చాలా చోట్ల మనకెందుకులే గొడవ అని అధికారులు సర్ధుకుపోతున్నారు .
డిప్యూటీ మేయర్ భర్త డ్రైవర్ పై కేసు నమోదు...
అక్రమ వసూళ్లు, బెదిరింపు వ్యవహారంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి భర్త శోభన్ రెడ్డి డ్రైవర్ తుల్జాసింగ్ పై ఉప్పల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే . భవనాల ఇతను నిర్మాణదారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లే దందాగా మార్చుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి . నిర్మాణ
అనుమతుల పేపర్లు, డబ్బులు సర్కిల్ కార్యాలయానికి రావాలని ఉప్పల్ మెయిన్ రోడ్డులో భవన నిర్మాణం చేపడుతున్న యజమానిని బెదిరించాడు. దీంతో సదరు నిర్మాణదారుడు తుల్జాసింగ్ పేరుతో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతని పై కేసు నమోదు
చేయడం గ్రేటర్ లో సంచలనంగా మారింది . ఈ నేపథ్యంలో మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం . మోతే శోభన్ రెడ్డి వద్ద తుల్జాసింగ్ డ్రైవర్ గా పని చేస్తూ వ్యక్తిగత పనులు కూడా చేపడుతుంటారని తెలిసింది . ఇతను డిప్యూటీ మేయర్ పేరు చెప్పి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ యజమానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది .






