- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యోమగామి శుభాంశు శుక్లను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలి: వీసీ సజ్జనార్
భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

దిశ, రవీంద్ర భారతి: భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. 41 ఏళ్ల విరామం తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. సోమవారం రవీంద్రభారతిలో కలామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శుభాంశు శుక్ల రచించిన "సెకండ్ ఆర్బిట్" పుస్తకాన్ని సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, Axiom-4 మిషన్‌లో పైలట్‌గా పాల్గొని శుభాంశు శుక్ల భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆయన రచించిన "సెకండ్ ఆర్బిట్" పుస్తకంలో అంతరిక్ష యాత్రలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను పొందుపరిచారని తెలిపారు. శుభాంశు శుక్ల మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. శుభాంశు శుక్ల మాట్లాడుతూ.. అంతరిక్షం వరకు తన ప్రయాణం వెనుక ఉన్న అనుభవాలను దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు శుభాంశు శుక్ల సమాధానాలు ఇస్తూ, అంతరిక్ష యాత్రకు సంబంధించిన తన అనుభవాలను వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






