రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు.. త్వరలో నోటిఫికేషన్!

by Javid Pasha |

రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ సైడ్ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఒకటీ రెండు నెలల్లోనే టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దమవుతుందని సమాచారం.

రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు.. త్వరలో నోటిఫికేషన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తెలంగాణకు మణిహారం. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. గ్రేటర్ హైదరాబాద్ విస్తరించిన నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారుతుంది. ఉత్తర భాగం పనులు స్పీడ్ అందుకోనున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ సైడ్ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఒకటీ రెండు నెలల్లోనే టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్దమవుతుందని సమాచారం. రానున్న మూడేండ్లల్లో త్రిబుల్ ఆర్ నార్త్ పార్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

161.5 కిలో మీటర్లు.. రూ.15,627 కోట్లు

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర దిక్కున సంగారెడ్డి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్రిబుల్ ఆర్ నిర్మాణానికి పెరిగిన అంచనాల ప్రకారం 161.5 కిలో మీటర్ల ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.15,627 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు టెండర్ ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా, ఇప్పుడు హ్యామ్ మోడల్‌‌‌‌‌‌‌‌ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంటర్‌సిటీ కనెక్టివిటీ..

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించింది. ఏడు కార్పొరేషన్లను, 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ గా మారింది. దేశంలో అతి పెద్ద నగరంగా అవతరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హై-స్పీడ్ రవాణా కారిడార్‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు త్రిబుల్ ఆర్ అవసరం పెరిగింది. ఇది భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ను మళ్లించడం, అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అనుసంధానించడం భారత్ మాల ప్రాజెక్టు ఉద్దేశం. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

అంచనాలకు అనుగుణంగా..

రీజినల్ రింగ్ రోడ్డును రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 343.5 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తుండగా రెండు భాగాలుగా విభజించారు. నార్త్‌‌‌‌‌‌‌‌ పార్ట్ 161.5 కిలో మీటర్లు, సౌత్‌‌‌‌‌‌‌‌ పార్ట్ 182 కిలో మీటర్లుగా డివైడ్ చేశారు. మొదట నార్త్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్దం చేశారు. ముందు 4 లేన్స్‌‌‌‌‌‌‌‌‌తో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం రూ.7,104.06 కోట్లతో 2024 డిసెంబరు‌లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్ ఆర్ రోడ్డును ఆరు లేన్లుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెరిగిన అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ రోడ్డు నిర్మాణానికి రూ.15,627 ఖర్చు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.

Next Story