కోకాపేట.. కాసుల కోట..! వేలంపాటలో రూ.3,862.8 కోట్ల ఆదాయం

by Javid Pasha |   (  Updated:2025-12-06 10:36:10  IST  )

కోకాపేట్‌లో నియోపొలిస్ లేఅవుట్, గోల్డ్ మైన్ లేఅవుట్లలో నిర్వహించిన వేలంపాటలో హెచ్ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది.

కోకాపేట.. కాసుల కోట..! వేలంపాటలో రూ.3,862.8 కోట్ల ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో :హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో డెవలప్ చేసిన కోకాపేట లేఅవుట్లు కాసుల కోటగా మారాయి. అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కోకాపేట్‌లో నియోపొలిస్ లేఅవుట్, గోల్డ్ మైన్ లేఅవుట్లలో నిర్వహించిన వేలంపాటలో హెచ్ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది. నియోపొలిస్ లేఅవుట్ ద్వారా రూ.3,708 కోట్లు, గోల్డెన్ మైల్ లేఅవుట్ ద్వారా రూ.154 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయంతోపాటు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిందనడానికి నిదర్శనమని పలువురు బిల్డర్లు, డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తన భూవేలం ప్లాట్ల తాజా దశను విజయవంతంగా పూర్తి చేసింది. మోనిటైజేషన్ కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని అధికారులు చెబుతున్నారు.

ఆరు ప్లాట్లకు రూ.3,708కోట్లు

కోకాపేట్ లో సుమారు రూ.300కోట్లకుపైగా ఖర్చుతో 40 ఎకరాలతో కూడిన నియోపొలిస్ లేఅవుట్ ను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. ఈ లేఅవుట్ లో హెచ్ఎండీఏ సకల సౌకర్యాలను కల్పించింది. ఫలితంగానే రికార్డు స్థాయి రేట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఈ లేఅవుట్ లోని ఎకరాకు హెచ్ఎండీఏ రూ.99కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించింది. 15 నుంచి 20 వరకు ఆరు ప్లాట్లకు నిర్వహించిన వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,708కోట్ల ఆదాయం వచ్చింది. 15వ నెంబర్ ప్లాట్ లోని ఎకరాకు రూ.151.25కోట్లు వెచ్చించి 4.03ఎకరాలను రూ.609కోట్లతో జీహెచ్ఆర్ లక్ష్మీ ఇన్ ఫ్రా అర్బన్ బ్లాక్స్ సంస్థ దక్కించుకున్నది. 16వ నెంబర్ ప్లాట్ లోని ఎకరా రూ.147.75కోట్ల చొప్పున 5.03ఎకరాలను రూ.743కోట్లతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. 18వ ప్లాట్ లో ఎకరాకు రూ.137.25కోట్లు వెచ్చించి 5.31ఎకరాలను రూ.728.79కోట్లతో ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ దక్కించుకున్నది. ఎకరాకు రూ.136.50కోట్ల చొప్పున 4.59ఎకరాలను రూ.626.53కోట్లతో వజ్రా హౌసింగ్ ప్రాజెక్టు ఎల్ఎల్పీ సంస్థ దక్కించుకున్నది. ఈ రెండుప్లాట్ల ద్వారా హెచ్ఎండీఏకు రూ.1356కోట్ల ఆదాయం వచ్చింది. మూడో దశలో ప్లాట్ నెం.19, 20 లకు నిర్వహించిన వేలం ద్వారా రూ.1000కోట్ల ఆదాయం వచ్చింది. 19వ నెంబర్ ప్లాట్ ను యులా కన్ స్ట్రక్షన్స్ ఎల్ఎల్పీ, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ సంస్థలు ఎకరాకు రూ.131 కోట్ల చొప్పున 4 ఎకరాలను రూ.524కోట్లకు దక్కించుకున్నాయి. ప్లాట్ నెం.20ను బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎకరాకు రూ.118 కోట్ల చొప్పున 4.04ఎకరాలను రూ.476.72కోట్లతో దక్కించుకున్నది.

గోల్డెన్ మైల్‌తో రూ. 154 కోట్లు..

కోకాపేట్ లోని గోల్డెన్ మైల్ లేఅవుట్ లోని 1.98ఎకరాలకు శుక్రవారం వేలం నిర్వహించారు. ఎకరాకు రూ.77.75కోట్ల చొప్పున 1.98ఎకరాలను కోయిస్ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.154కోట్లకు దక్కించుకున్నది. స్థలం ప్రత్యేక ఆకారంలో ఉండటం ఈ ఫలితాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. హెచ్ఎండీఏ చారిత్రాత్మక వేలం పాట్ల సిరీస్ ముగిసిందని, ఈవేలం ద్వారా మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

వేలం.. సక్సెస్

హెచ్ఎండీఏ వేలంపాట్ల కార్యక్రమానికి ట్రాన్సాక్షన్ సలహాదారులుగా కుష్మాన్ & వేక్‌ఫీల్డ్, అలాగే ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్ మద్దతు అందించాయి. మొత్తం సిరీస్‌లో పారదర్శక పోటీ, సమర్థవంతమైన బిడ్డింగ్ ప్రక్రియను వీరు నిర్ధారించారు. ఈ విజయవంతమైన ఫలితాలు హైదరాబాద్‌ను భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా మరింత బలపరుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story