వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు

by Dishanational1 |
వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తోపాటు రాష్టంలోని నగర పంచాయతీలు, మున్సిపాల్టీలతోపాటు అన్ని స్థానిక సంస్థల పరిధిల్లో వీధి కుక్కల బెడ‌ద‌ నివారణకు యుద్దప్రాతిప‌దిక‌న చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. అర్వింద్ కుమార్ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తరుచూ జరుగుతున్న కుక్క కాట్ల సంఘటనల నేపథ్యంలో ఆయన బుధవారం మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. మున్సిప‌ల్ శాఖ కార్యద‌ర్శి సుద‌ర్శన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌, మున్సిప‌ల్ ప‌రిపాల‌న డైరక్టర్ స‌త్యనారాయ‌ణ, జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మీష‌న‌ర్లు, జీహెచ్ంసీ వెట‌ర్నరీ విభాగం అధికారులు హాజరైన సమావేశంలో అర్వింద్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్రస్తుతం ఐదున్నర ల‌క్షల వీధి కుక్కలున్నాయ‌ని, 2011లో 8 ల‌క్షల 50 వేలు ఉండేవ‌న్నారు. ఆ కుక్కలకు స్టెరిలైజేష‌న్ ఆప‌రేష‌న్స్ నిర్వహించ‌డం వ‌ల్ల వాటి సంఖ్య 5 ల‌క్షల 50 వేల‌కు త‌గ్గింద‌ని ఆయ‌న తెలిపారు. మిగిలిన వాటికి వెంట‌నే ఎబీసీ(ఎనిమల్‌ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేష‌న్ ఆప‌రేష‌న్లు నిర్వహించాల‌ని ఆదేశించారు.

ఎండాకాలం మొదలవుతున్నందున, దాహాంతో కుక్కలు రెచ్చిపోకుండా ఉండేందుకు ఆయా కాల‌నీల‌ల్లో కొన్ని వాట‌ర్ పాయింట్స్( నీటి నిల్వ స‌దుపాయం)ను కూడా ఏర్పాటు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న హోట‌ల్స్‌, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్‌, చికెన్ సెంట‌ర్స్‌, మ‌ట‌న్‌ సెంట‌ర్లు వ్యర్థ ప‌ద‌ర్థాల‌ను వీధుల్లో వేయ‌టాన్ని అధికారులు క‌ట్టడి చేయాల‌ని ఆదేశించారు. ఈ మాంస వ్యర్థాల కారణంగా నగరంలో వీధి కుక్కలు బెడద పెరుగుతుందని, దీన్ని నిరోధించేందుకు తగిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. న‌గ‌రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లో విధ్యార్థుల‌కు అవ‌గాహ‌న కార్యక్రమాలు నిర్వహించాల‌ని ఆయ‌న సూచించారు. పాఠ‌శాల విధ్యార్థుల‌కు పెంపుడు కుక్కల గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వల్లే వాటి భారిన ప‌డుతున్నార‌ని. దీనిని నియంత్రించ‌డానికి విద్యార్థుల‌కు కూడా స‌రైన అవ‌గాహ‌న పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనికి సంబంధించి క‌ర‌ప‌త్రాలు, హోర్డింగ్స్ సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

న‌గ‌ర, మున్సిపాలిటీల ప‌రిధిలల్లో ఉన్న స్లమ్‌ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫెడ‌రేష‌న్స్‌, టౌన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫెడ‌రేష‌న్స్‌, రెసిడెంట్ కాల‌నీ వెల్ఫెర్ అసోసియేష‌న్స్ స‌హ‌కారంతో నియంత్రణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇత‌ర మున్సిపాలిటీలల్లో మోప్మా, స్వయం స‌హాయ‌క బృందాల‌ను నియంత్రణ చర్యల్లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. పెంపుడు జంతువుల వివరాల న‌మోదు కోసం ఒక ప్రత్యేక మోబైల్ యాప్ ను సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదుల‌ను మై జీహెచ్ఎంసీ యాప్ కు గానీ, టోల్ ఫ్రీ నెంబ‌ర్ 040-21111111 ద్వారా న‌మోదు చేసేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. ప్రత్యేక మొబైల్ యాప్‌లో సంబంధిత య‌జ‌మానులు న‌మోదు చేసుకోవాల‌ని త‌ద్వారా ఒక గుర్తింపు కార్డును వారికి జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఎక్కువ‌గా కేసులు న‌మోదవుతున్న ప్రాంతాల‌ను గుర్తించి, అక్కడ త‌క్షణ‌మే నివారణ చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాల‌ని అర్వింద్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.


Next Story

Most Viewed