అమ్మో ఆరాంఘర్.. ట్రాఫిక్‌తో నరకయాతన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-18 02:51:47  IST  )

సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వైపు వెళ్లేందుకు రోడ్డెక్కిన ప్రయాణికులు గమ్యం చేరేందుకు నరకం చూస్తున్నారు. ‘అమ్మో ఆరాంఘర్ వైపా నేను రానంటూ’ బెంబేలెత్తిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ సమస్యతో విసుగెత్తి పోతున్నారు. కిలోమీటరు దూరానికి అరగంట వెచ్చించాల్సి వస్తోంది.

అమ్మో ఆరాంఘర్.. ట్రాఫిక్‌తో నరకయాతన
X

దిశ, రాజేంద్రనగర్ : సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వైపు వెళ్లేందుకు రోడ్డెక్కిన ప్రయాణికులు గమ్యం చేరేందుకు నరకం చూస్తున్నారు. ‘అమ్మో ఆరాంఘర్ వైపా నేను రానంటూ’ బెంబేలెత్తిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ సమస్యతో విసుగెత్తి పోతున్నారు. కిలోమీటరు దూరానికి అరగంట వెచ్చించాల్సి వస్తోంది. ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది.

పోలీసుల అవస్థలు..

ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లాలనే తొందరలో సిగ్నల్స్ వద్ద తమ ఇష్ట రీతిలో వాహనాలను నిలుపుతుండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

నాలుగు సిగ్నల్స్ వద్ద మరింతగా..

బెంగళూరు, కర్నూల్ నుంచి నగరానికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఆరాంఘర్ ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సిందే. దీంతో ప్రధాన రహదారి పై రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఆరాంఘర్ చౌరస్తాలోని నాలుగు సిగ్నల్స్ వద్ద ఈ సమస్య మరింత అధికంగా మారింది. సిగ్నల్స్ పడినపుడు వందలాది వాహనాలు బారులు తీరుతున్నాయి.

అండర్ పాస్ బ్రిడ్జ్ వద్దే ట్రాఫిక్ సమస్య..

చంద్రాయణ గుట్ట నుంచి జూ పార్క్ వైపు వెళ్లాలంటే రాంఘర్ చౌరస్తాలో యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చంద్రాయణ గుట్ట నుంచి మెహిదీపట్నం వెళ్లాలంటే అండర్ పాస్ బ్రిడ్జి కింద నుంచి వెళ్లొచ్చు. రెండు వైపులా వెళ్లే వాహనాలు అండర్ పాస్ బ్రిడ్జి వద్దకు రాగానే జూ పార్క్ వైపు వెళ్లే వాహనాలు ఎడమవైపు ఉండాల్సింది పోయి కుడి వైపు నిలుపుతున్నారు. దీంతో మెహిదీపట్నం వెళ్లే వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. అలాగే మెహదీపట్నం నుంచి చంద్రాయణ గుట్ట వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ బ్రిడ్జిని ఉపయోగించి సులువుగా వెళ్లొచ్చు. కానీ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద కుడి వైపు శంషాబాద్, ఎడమవైపు జూ పార్క్ వెళ్లాల్సిన వాహనాలు సిగ్నల్ పడిన సమయంలో అడ్డుగా నిలబడుతున్నాయి. దీంతో చంద్రయణ గుట్ట వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి.

ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి

ఆరాంఘర్ చౌరస్తా వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. చౌరస్తా వద్ద ప్రతినిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు, వాహనాల మళ్లింపు విషయంలో పోలీసులు దృష్టి సారించాలి. శివరాంపల్లి రైల్వే గేట్ వద్ద మూసివేసిన రహదారిని ఓపెన్ చేస్తే ట్రాఫిక్ సమస్య కాస్తయినా తగ్గుతుంది. శివరాంపల్లి టూ ఆరాంఘర్ చౌరస్తాలో విద్యుత్ స్తంభాలు తొలగిస్తే రోడ్డు వెడల్పు చేసే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

- సదాల వెంకట్ రెడ్డి, శివరాంపల్లి

ఆరాంఘర్ చౌరస్తా వెడల్పు చేసేందుకు ప్రయత్నిస్తాం..

ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కరానికి చౌరస్తాల వెడల్పు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విద్యుత్ స్థంబాలను తొలగించి రోడ్డు వేయాలని కోరుతాం. మెహిదీపట్నం నుంచి చాంద్రా యణగుట్ట వెళ్లే వాహనాలు నేరుగా వెళ్ల కుండా ఎడమపక్కకు తిరిగి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ కింది నుంచి యూటర్న్ తీసుకొని చాంద్రాయణగుట్ట వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాం. ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ చౌరస్తాలోని ఇండియానా బేకరీ వద్ద నిలపకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నిలిపేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరాంఘర్ నుంచి ఎడమవైపు శంషాబాద్ కు వెళ్లేందుకు వీలుగా రోడ్డును వెడల్పు చేస్తున్నాం. ఎడమవైపు ఉన్న బస్ స్టాప్ ను పరివార్ దాబా దగ్గర ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులకు లేఖ రాశాం. వాహనదారులు పోలీసులకు సహకరించాలి

- సీహెచ్ రాజు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ

Next Story