నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం

by Jakkula.Mamatha |

నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది.

నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
X

దిశ, శేరిలింగంపల్లి: నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా ఎల్బీనగర్, వనస్థలీపురం, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, బేగంపేట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, గోల్కొండ, టోలీచౌకి, జియాగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బషీర్ బాగ్, నాంపల్లి, కోఠీ, ఎంజే మార్కెట్, బేగం బజార్ లతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎల్బీ నగర్, ఉప్పల్, వనస్థలీపురం, హయత్ నగర్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ మాదిరిగా కుండపోత వర్షం కురిసింది. ఆదివారం కావడంతో చాలా మంది బయటకు రాకపోవడంతో జనాలకు కాస్త ఇబ్బందులు తప్పాయనే చెప్పాలి, అటు అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ఉండడంతో ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చిన వారు వర్షం లో ఇరుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మూసాపేట్ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మన్సూన్ టీమ్స్, హైడ్రా సిబ్బంది మ్యాన్ హోల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Next Story