- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరుగా కురుస్తున్న వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, హైదరాబాద్ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగర వ్యాప్తంగా ఒక ప్రాంతంలో కురిసి, మరో ప్రాంతంలో లేదనకుండా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ప్రజలకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొంత సేపు ముసురులా, మరికొంత సమయం జోరుగా కురియడంతో కాలనీలు, రోడ్లపై వర్షం నీరు చేరింది. కొన్ని కాలనీల రోడ్లు నీటితో మునిగిపోగా.. చాలా చోట్ల రోడ్లు బురదమయంగా మారాయి. ఎక్కువ చోట్ల వర్షాలతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. డీఆర్ఎఫ్ టీంలను సిద్దం చేసి ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
నిలిచిన వర్షపు నీరు.. ప్రజలకు తిప్పలు..
రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో వరద చేరుతున్నది. చాలా బస్తీల్లో నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఎక్కడ మ్యాన్ హోల్ తెరచి ఉంటుందోననే భయం ప్రజలను వెన్నాడింది. హైటెక్ సిటీ, ఎంజే మార్కెట్, మాదాపూర్ , ముషీరాబాద్, ఉప్పల్, కుషాయిగూడ, అమీర్ పేట్, చాదర్ ఘాట్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్త పేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్, నాగోల్, బండ్లగూడ , అబిడ్స్, కోఠి , బేగంబజార్ , పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ , సనత్ నగర్, పంజాగుట్ట, బాలానగర్, మియాపూర్ ఇలా అన్ని చోట్ల కురిసిన వర్షానికి ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వారితో కొన్ని చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఓ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జాం వాహనదారులకు చుక్కలు చూపించాయి. కొన్ని చోట్ల వాహనాలు మొరాయించడంతో వాహనదారులు గంటలపాటు ట్రాఫిక్ లో నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
విద్యుత్ సరఫరాలో అంతరాయం..
రెండు రోజులుగా వదలకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గంటల పాటు కరెంట్ నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. విద్యుత్ సరఫరా కోసం ఫ్యూజ్ ఆఫ్ కాల్ కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఓ వైపు వర్షం, మరో వైపు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు.
నిండు కుండలా జంట జలాశయాలు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు, ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. కాగా.. ఎగువ ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుండడంతో వరద తాకిడి పెరిగింది. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1760.25 అడుగులకు చేరింది. మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగితే ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణ మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరుగుతున్నది. దీంతో దిగువన ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా మూసీకి కూడా వరద పెరిగిపోతుండడంతో పరివాహక ప్రాంతాల్లో నివాముండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.






