ప‌ని మ‌నిషిగా చేరి రూ.19 ల‌క్ష‌లు చోరీ

by Ratna Kumari |

ఓ ఇంట్లో పని మనిషిగా చేరి భారీ నగదు దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ప‌ని మ‌నిషిగా చేరి రూ.19 ల‌క్ష‌లు  చోరీ
X

దిశ, జూబ్లీహిల్స్ : ఓ ఇంట్లో పని మనిషిగా చేరి భారీ నగదు దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్, ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే ఒక వ్యాపారవేత్త నివాసం నుంచి ₹19,00,000/ నగదును దొంగిలించిన కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు ఛేదించారు. ఈ చోరీలో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు. నివాసంలో పని మనిషిగా పని చేస్తున్న మహిళ, ఆమె మైనర్ కుమార్తె తో కలిసి కొంతకాలంగా నగదును దొంగిలిస్తున్నారని బాధితుడు పిర్యాదు చేశాడు. గతంలో ₹40,000/- నగదు కనిపించకుండా పోయింది. దీనిని ఆ మైనర్ బాలిక దొంగిలించినట్లు అంగీకరించి, ఆ నగదును తిరిగి ఇచ్చేసింది. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బోరబండ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసు బృందం గుర్తించింది.

పోలీసులను గమనించిన వెంటనే, వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. క్రైమ్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారించగా.. ఆ పనిమనిషి, ఆమె మైనర్ కుమార్తె తాము దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఈ నేరంలో తమకు సహకరించిన 'దేవ కుమార్ అలియాస్ చింటు' అనే వ్యక్తి ప్రమేయం కూడా ఉందని, అతను ఆ మైనర్ బాలికకు స్నేహితుడని వెల్లడించారు. బాధితుడి ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న సమయంలోనే తాము ₹19,00,000/- నగదును దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు, నిందితుల నుంచి ₹8,00,000/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story