ఆయన రూటే సపరేటు! మార్కెట్‌లో చిచ్చుకు కారకుడాయనే?

by Thanuru Gopichand |   (  Updated:2025-12-05 02:51:58  IST  )

అతనో కమీషన్ ఏజెంట్.. బోయిన్‌పల్లి వెజిటేబుల్ మార్కెట్‌లో లైసన్స్ హోల్డర్.

ఆయన రూటే సపరేటు! మార్కెట్‌లో చిచ్చుకు కారకుడాయనే?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అతనో కమీషన్ ఏజెంట్.. బోయిన్‌పల్లి వెజిటేబుల్ మార్కెట్‌లో లైసన్స్ హోల్డర్. నిబంధనలకు విరుద్దంగా పటాన్‌చెరు మార్కెట్లో కూడా ఇతను మరో లైసెన్స్ పొందినట్లు సమాచారం. మార్కెట్లలో చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూడడమే కాకుండా.. మిగితా కమీషన్ ఏజెంట్లను రెచ్చగొట్టి మార్కెట్లలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడంలో ఇతను దిట్టా అనే టాక్ ఉంది. ప్రస్తుతం బోయిన్‌పల్లి మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ శ్రీనివాస్ గౌడ్, కిరాయిదారుడు మహేందర్ రెడ్డి మధ్యన వివాదానికి సైతం ఇతనే కారణమనే ప్రచారం జరుగుతోంది.

రెండు చోట్ల లైసెన్స్...

మార్కెటింగ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి రెండు చోట్ల లైసెన్స్ ఉండకూడదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇతను బోయిన్‌పల్లి వెజిటేబుల్ మార్కెట్‌తో పాటు పటాన్‌చెరు మార్కెట్‌లో కూడా లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రెండు చోట్ల కమీషన్ ఏజెంట్ లైసెన్స్ తీసుకున్న సదరు వ్యక్తి ఇటు పటాన్‌చెరు మార్కెట్‌లో వ్యాపారం చేయలేకపోతున్నాడని, బోయిన్‌పల్లి మార్కెట్‌కు సైతం రెగ్యులర్‌గా రావడంలేదని తోటి కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. అదే విధంగా వంటిమామిడి మార్కెట్‌లో లైసెన్స్‌లను ఇప్పించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సదరు కమీషన్ ఏజెంట్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు ప్రాంత మార్కెట్లలో లైసెన్స్‌లు ఇప్పిస్తానని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బేరసారాలు..

బోయిన్‌పల్లి మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ శ్రీనివాస్ గౌడ్ నుంచి వ్యాపార లైసెన్స్ తిరిగి కిరాయిదారుడైన మహేందర్ రెడ్డికి ఇప్పించేందుకు సదరు కమీషన్ ఏజెంట్ రూ.లక్షల్లో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో తోటి కమీషన్ ఏజెంట్ పైనే అసోసియేషన్ ప్రతినిధులను ఉసిగొల్పి మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణానికి కారకుడయ్యాడని వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే మార్కెట్ చైర్మన్ అనంద్‌గౌడ్ పై లైసెన్స్‌దారు కాని వ్యక్తితో అవినీతి ఆరోపణలు చేయిస్తున్నాడని, స్వలాభం కోసం సదరు కమీషన్ ఏజెంట్ ఎంతకైనా దిగజారుతాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎదుగుదలను చూసి ఓర్వలేక సొంత కుటుంబ సభ్యులపైనే మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే బోయిన్‌పల్లి వివాదం సమసిపోకుండా రోజుకో ట్విస్ట్‌తో వ్యాపారులను రెచ్చగొడుతున్న సదరు కమీషన్ ఏజెంట్‌పై గురువారం ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరాతీసినట్లు తెలిసింది.

Next Story