- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లోని సాలర్ జంగ్ మ్యూజియంలో ఫౌండర్స్ గ్యాలరీని ప్రారంభించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
దిశ , హైదరాబాద్ బ్యూరో : కళ, విజ్ఞానం పట్ల దార్శనికత, ఉత్సుకత, గౌరవాల అరుదైన సమ్మేళనాన్ని సాలర్ జంగ్ మ్యూజియం ప్ర

దిశ , హైదరాబాద్ బ్యూరో : కళ, విజ్ఞానం పట్ల దార్శనికత, ఉత్సుకత, గౌరవాల అరుదైన సమ్మేళనాన్ని సాలర్ జంగ్ మ్యూజియం ప్రతిబింబిస్తుందని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాలార్ జంగ్ మ్యూజియం 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫౌండర్స్ గ్యాలరీని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాలార్ జంగ్ మ్యూజియం వారసత్వాన్ని ప్రస్తావించారు . భారతీయ, పాశ్చాత్య, తూర్పు ప్రాంతాల సంప్రదాయాలను సూచిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన గ్యాలరీలతో పాటు అరుదైన చేతిరాత ప్రతులు, కాలిగ్రాఫిక్ రచనలు ఉన్న గొప్ప లైబ్రరీతో ఈ సాలార్ జంగ్ మ్యూజియం భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే ముఖ్య భాండాగారంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను ఉటంకిస్తూ అత్యున్నత విద్య కేవలం మనకు సమాచారాన్ని అందించేది మాత్రమే కాదని, అది మన జీవితాన్ని సమస్త సృష్టితో సామరస్యంగా ఉండేలా చేస్తుందని, ఈ ఆదర్శాన్ని సాకారం చేయడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
మ్యూజియాలను శక్తిమంతమైన అభ్యసన కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు . మ్యూజియాలు కేవలం స్థిరమైన ప్రదర్శన స్థలాలుగా, సందర్శకులను ఆకర్షించే సాధారణ ప్రదేశాలుగా కాకుండా యువత క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంపొందించే అద్భుత అభ్యసన కేంద్రాలుగా పరిణామం చెందాలని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ప్రదర్శన స్థలాలను అభివృద్ధి చేయడం పట్ల మ్యూజియం అధికారులను అభినందించారు . యువ ప్రేక్షకులను ఆకర్షించడానికి వినూత్న విధానాలను అవలంబించడం కొనసాగించాలని కోరారు. దేశవ్యాప్తంగా మ్యూజియంలు ఎదుర్కొంటున్న సవాళ్లను, తగ్గుతున్న సందర్శకుల సంఖ్యనూ ప్రస్తావించిన గవర్నర్ సాలార్ జంగ్ మ్యూజియం సమాజ సేవలో భాగస్వామ్య, సమ్మిళిత, శక్తిమంతమైన సంస్థగా ఎదగడం ద్వారా ఒక నమూనాగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. దాన కిషోర్, ,చందా పండిత్, నవాబ్ అథెర్మ్ అలీ ఖాన్ ,మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ పాల్గొన్నారు.






