ఆయన ప్లాన్‌లు మేమూ వింటాం: ఆది శ్రీనివాస్ సెటైర్లు

by Vemula.Srinu Prasad |

కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరం ఇస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామని కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని, 2023 అక్టోబరు 21వ మేడిగడ్డ కుంగిపోతే కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ...

ఆయన ప్లాన్‌లు మేమూ వింటాం: ఆది శ్రీనివాస్ సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరం ఇస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామని కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని, 2023 అక్టోబరు 21వ మేడిగడ్డ కుంగిపోతే కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అపవాదులు వేస్తున్నారని, యాభై వేల మంది‌తో వెళ్లి పంప్‌లు ఆన్ చేస్తామనడం సంఘ విద్రోహ చర్య అవుతుందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరంపైన విచారణ అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐకి పంపించామని, బీజేపీతో ములాఖత్ రాజకీయాల వల్ల విచారణ ఆలస్యం అవుతుందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

కాళేశ్వరంలో ఏం జరిగిందో, ఎలాంటి అవకతవకలు జరిగాయో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు తెలుసు అని, కాళేశ్వరం అవినీతి పైన విచారణ జరిగితే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ హాయాంలో దాదాపు 209 వారాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేతిలోనే ఉందని, మేడిగడ్డ కూలడంపైన ఎలాంటి విచారణ జరపలేదని ఆయన ఆరోపించారు. మహాదేవ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి వదిలేశారని, లక్ష కోట్లు గోదావరి పోసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తప్పు అయిందని లెంప‌లు వేసుకుని గుంజిలు తీయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో నీళ్లు ఇచ్చే తెలివి ఉంటే కూలిన కాళేశ్వరాన్ని ఎందుకు రిపేర్ చేయించలేదని ఆయన నిలదీశారు. కేసీఆర్ ఎందుకు కాళేశ్వరంపైన స్సందించడం లేదని, పిల్ల రాక్షసులను బయటకు పంపించి కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నాడని ఆది శ్రీనివాస్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

పద్దతి, డిజైన్ లేకుండా కమిషన్ల కోసం ఇష్టానుసారంగా కట్టారని, కన్నెపల్లి పంప్ హౌస్ రెండు సార్లు ముగినిపోయిన విషయం కేటీఆర్ కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం పైన మాట్లాడాలని, కాళేశ్వరం నుంచి ఎలా నీళ్లు ఇస్తారో కేసీఆర్ అసెంబ్లీలో వివరించాలి, ఆయన ప్లాన్ లు ఏమిటో తాము కూడా వింటామని ఆది శ్రీనివాస్ తెలిపారు. కరెంటు బిల్లు తప్ప కాళేశ్వరం నుంచి ఏమీ సాధించలేదని, కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో పంటలు పండించామన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ అబద్దాల ఆట మొదలు పెట్టాడని, ఇప్పుడే విత్తనాలు విత్తుకుంటుంటే పంటలు ఎలా ఎండిపోతాయని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మేడిగడ్డలో నీళ్లు ఆపితే డ్యాం కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ చెప్పిందని, ఆ సూచనల ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. కాళేశ్వరం పైన తమ ప్రభుత్వానికి ఎలాంటి దుర్దేశాలు లేవని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Next Story