ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌పై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-20 23:50:44  IST  )

ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌పై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది.

ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌పై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం
X

దిశ, సిటీ బ్యూరో: ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌పై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆదివారం నుంచి జరిమానాలతో ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేయనున్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొడుతున్న వారిపై చర్యలు తీసుకొని మరీ కలెక్షన్ చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి జీహెచ్ఎంసీ చరిత్రలో తొలిసారిగా 2025 (ఈ ఏడాది సంబంధించి) రూ.వంద కోట్ల మార్క్ దాటింది. గ్రేటర్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ డేటా బేస్ ప్రకారంగా మొత్తం 3,17,033 ప్రాపర్టీలు నాన్ రెసిడెన్షియల్ పరిధిలో ఉన్నాయి. ఇందులో చిన్నచిన్నవి వదిలిపెట్టినా అధికారికంగా 2 లక్షల ట్రేడ్ లైసెన్స్ కనీసం జారీ కావాల్సి ఉంది. ఇందులో క్లోజ్ ఎన్ని అయ్యాయని, ఎన్ని కొనసాగుతున్నాయని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. 2025కి సంబంధించి ఇప్పటి వరకు 1,13,000 ట్రేడ్స్ నుంచి రూ.112 కోట్లను జీహెచ్ఎంసీ కలెక్ట్ చేసింది. ఈ 10 రోజుల్లో మరో రూ.2 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతోనే బల్దియాకు రావాల్సిన ఆదాయం రావడంలేదు. ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి తనిఖీ చేస్తే ట్రేడ్ ఫీజు ఆదాయం భారీగా పెరిగే చాన్స్ ఉంది. ఇదే విషయంపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ సిరీయస్‌గా ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ జీహెచ్ఎంసీకి ట్రేడ్ చెల్లించకుండా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతోనే సర్కిల్ అధికారుల్లో కాస్తా మార్పు వచ్చింది.

నేటి నుంచి జరిమానాతో కలెక్ట్

వచ్చే సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్‌ లైసెన్సులను ఈ నెల 20 లోపు రెన్యువల్ చేసుకోవాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ కోరింది. ఇంతలోపు కేవలం 35 వేల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. ఇంకా 70 శాతానికి పైగా స్పందించలేదు. నిర్ణయించిన గడువు లోపు రెన్యువల్ చేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఆదివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు రెన్యువల్ చేసుకునే వారికి 25 శాతం పెనాల్టీతో కలెక్ట్ చేయనున్నారు. అదే ఫిబ్రవరి 20 తరువాత చెల్లించే వారి నుంచి 50 శాతం జరిమానాతో వసూల్ చేయనున్నారు.

ఓఆర్ఆర్ పరిధితో పెరగనున్న కలెక్షన్

జీహెచ్ఎంసీ విస్తరణ తరువాత ఓఆర్ఆర్ వరకు పరిధి పెరిగింది. దీంతో సర్కిల్స్ 30 నుంచి 57కి పెరగాయి. అంతేకాకుండా వార్డులు 150 నుంచి 300కు పెరిగాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెరిగే అవకాశం ఉంది. అయితే విలీనమైన లోకల్ బాడీల్లో ఆర్థిక సంవత్సం ప్రకారం ట్రేడ్ లైసెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లోనూ మార్పులు చేయనున్నారు.




Next Story