- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: తెరపైకి మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసం
బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ పీఠం దక్కించుకున్న గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ పీఠం దక్కించుకున్న మోతె శ్రీలతశోభన్ రెడ్డిలను గద్దె దించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది.

దిశ, సిటీబ్యూరో : బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ పీఠం దక్కించుకున్న గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ పీఠం దక్కించుకున్న మోతె శ్రీలతశోభన్ రెడ్డిలను గద్దె దించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఈ విషయంపై నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్‌లో గెలిచి మేయర్ పదవి దక్కించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎలాగైన దించాలని ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు సీరియస్‌గా ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నాలుగేండ్ల తర్వాతనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశముంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌లో జరిగాయి. కానీ 11 ఫిబ్రవరి 2021న మేయర్, డిప్యూటీ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వచ్చేనెల 10తో నాలుగేండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీనేతలు ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే..
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కార్పొరేటర్లతో పాటు ఎక్స్-అఫిషియో సభ్యులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) మొత్తం సగం మంది సభ్యులు సంబధిత ప్రొఫార్మాపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అయితే జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా మారారు. మరో ఇద్దరు మరణించారు. దీంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 50 మంది ఎక్స్-అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 196 మంది ఉన్నారు. అంటే వీరిలో 98 మంది సంతకాలు చేసి కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్‌కు 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్‌కు మరో 27మంది సభ్యులు కావాలి. బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు ఉంటే సాధ్యమయ్యేది. కానీ ఎంఐఎం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఇక మిగిలింది బీజేపీనే, బీఆర్ఎస్, బీజేపీ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సాహసం చేస్తారా? అనేది చూడాల్సిందే. అయితే కొంత మంది బీజేపీ కార్పొరేటర్లు మాత్రం మేయర్‌ను గద్దెదించడానికి బీఆర్ఎస్‌కు మద్దతిస్తామని చెబుతున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
బల్దియాలో బలాబలాలు ఇలా..
2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 వార్డులను దక్కించుకుంది. తర్వాత నలుగురు బీజేపీ సభ్యులు బీఆర్ఎస్‌లో చేరడతో సంఖ్య 60కి చేరింది. అయితే 18 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 42 మందికి పడిపోయింది. బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ మరణించడంతో ఆ వార్డుకు ఉపఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతోపాటు గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మరణించడంతో బీజేపీ సంఖ్య 46కు చేరింది. వీరిలో ఆరుగురు సభ్యులు పార్టీ మారడంతో ప్రస్తుతం 39 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఎంఐఎం 44 స్థానాల్లో గెలిచింది. వీరిలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు రాజీనామా చేయడంతో 41కి చేరింది. 2020 ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడాది తర్వాత మూడుకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రస్తుత బలం 24 మందికి చేరింది.
పార్టీ పేరు కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియోలు
కాంగ్రెస్ 24, 5
బీఆర్ఎస్ 42, 29
బీజేపీ 39, 6
ఎంఐఎం 41, 10
మొత్తం 146, 50
ఫిబ్రవరి 1న సమావేశం ఉంటుందా?
బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరి 1న జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యులు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సైతం సిద్దం చేశారు. అదే రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం పెట్టడానికి అవకాశంలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఒకవేళ సమావేశం పెట్టిన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హజరవుతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతోపాటు గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటిని పరిశీలిస్తే కౌన్సిల్ సమావేశం ఉంటుందా? లేదా? అనేది చూడాల్సిందే.
అవిశ్వాసంపై చర్చించాం.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మా పార్టీ ఎమ్మెల్యేలను భోజనానికి పిలిచాం. ఇది పండుగ, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశం. రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయపరమైన సంభాషణ కూడా జరిగింది. మేయర్‌పై అవిశ్వాసం గురించి చర్చించాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. ప్రభుత్వ తీరుపై కూడా చర్చించాం. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో వాళ్లు గీత దాటితే.. మేము కూడా గీత దాటాల్సి వస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే మేము వద్దనడం లేదు. కానీ అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
అవిశ్వాసం పెడితే చూద్దాంలే.. మేయర్ గద్వాల విజయలక్ష్మి
బీఆర్ఎస్‌కు సంఖ్యా బలం ఎంత ఉందో వాళ్లకే తెలియదా? ఆ బలంతో అవిశ్వాస తీర్మానం పెడితే చూద్దాం. నేను గ్రేటర్ అభివృద్ధిపై దృష్టిసారించాను. ఉదయం నుంచి రాత్రి వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు చేస్తున్నాం.
వాళ్ల నుంచి కాదులే.. డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్ రెడ్డి
అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ నుంచి కాదులే. వాళ్లకు బీజేపీ మద్దతివ్వదు. ఎంఐఎం మద్దతివ్వదు. కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి వేగంగా జరుగుతున్నది.






