- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం..
నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది.

దిశ, చంపాపేట్: నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న అక్రమ కట్టడాలపై ఎల్‌బీనగర్ సర్కిల్-13 అధికారులు శుక్రవారం కఠిన చర్యలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏసీపీ అంబికా శ్రీ, టీపీఎస్ సాయి అర్చన, చైర్మన్లు కృష్ణ, రాజ్‌కుమార్, సెక్షన్ రైటర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ పాండు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీబీపాస్ చట్టం–2020, జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 461(ఏ) ప్రకారం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న మూడు భవనాలను గుర్తించి సీజ్ చేసి సీలింగ్ నోటీసులు అంటించారు. దుర్గానగర్, నిర్మల్‌నగర్ కాలనీ, శ్రీ సత్యసాయి ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం, అనుమతి లేని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమ కట్టడాల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు..
ఇప్పటికే సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేసి పనులను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగించినట్లు వెల్లడైంది. దీంతో అధికారులు నిబంధనల ప్రకారం భవనాలను సీజ్ చేసి తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కూడా వెనుకాడబోమని ఏసీపీ అంబికా శ్రీ, టీపీఎస్ సాయి అర్చన స్పష్టం చేశారు. నగరంలో భవన నిర్మాణ నిబంధనల అమలు, అక్రమ కట్టడాల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భవన యజమానులు అనుమతులు పొందిన ప్రణాళిక మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ఈ చర్యలను స్థానికులు స్వాగతిస్తూ, అక్రమ నిర్మాణాల కారణంగా ఏర్పడుతున్న పార్కింగ్, ట్రాఫిక్, డ్రైనేజీ వంటి సమస్యలకు చెక్ పడుతుందని అభిప్రాయపడుతున్నారు.






