- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైసలిచ్చినం పని చేయించండి.. అధికారులకు కమిషనర్ ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సవాల్‌గా మారింది. ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా విమర్శలు తప్పడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవీపీలను తొలగించాలని ప్రయత్నం చేస్తుంటే మరో చోట చెత్తను వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సవాల్‌గా మారింది. ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా విమర్శలు తప్పడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీవీపీలను తొలగించాలని ప్రయత్నం చేస్తుంటే మరో చోట చెత్తను వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మెరుగైన శానిటేషన్ కోసం జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ముఖ్యంగా బిల్లుల గురించి రాంకీ సంస్థ ప్రతినిధులు పదేపదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ రూ.100 కోట్ల బిల్లులను విడుదల చేసింది. వాళ్ల పెండింగ్ బిల్లులను ఇచ్చేశాం.. ఇక రాంకీతో పనిచేయించాలని అధికారులను కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. చెత్త నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాంకీకి జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
ఫెనాల్టీలు
చెత్త రవాణా విషయంలో రాంకీ సంస్థ అవసరమైన వాహనాలను వినియోగించలేదని గతనెల జీహెచ్ఎంసీ రూ.లక్ష ఫెనాల్టీ వేసింది. చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల విషయంలో రెండు నోటీసులు జారీచేసింది. ఇక నుంచి పనిచేయకపోతే ఫెనాల్టీలు వేయాల్సిందేనని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క నగరవాసులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సెంట్రల్ చలాన్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) యాప్ ద్వారా ఫెనాల్టీలు వేస్తున్నారు. ఈ వ్యవస్థను పకడ్బందీగా పనిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కనీసం ఫెనాల్టీలతోనైనా ప్రజల్లో మార్పురాకపోతుందా? అని అధికారులు భావిస్తున్నారు.
ఉద్యోగులకు సైతం
గ్రేటర్‌లో శానిటేషన్ విభాగంలో అవుట్‌సోర్సింగ్ కార్మికుల పాత్ర కీలకమే. సుమారు 18 వేల మంది కార్మికులు ఉన్నారు. 1500 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. విధి నిర్వహణలో కార్మికులు పూర్తి స్తాయిలో పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పర్మినెంట్ ఉద్యోగులు అసలు విధులకు హాజరుకావడం గగనంగా మారింది. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిని గుర్తించి వారికి సైతం ఫెనాల్టీలు వేయడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. కొంత మంది కార్మిక, ఉద్యోగుల యూనియన్ల పేర్లు చెబుతూ విధులకు హాజరుకావడంలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. శానిటేషన్ వర్కర్లు సక్రమంగా పనిచేసేందుకుగాను ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తున్నారు. అయితే శానిటేషన్ విభాగంలోని పర్మినెంట్ ఉద్యోగులకు అమలు చేయాలని నిర్ణయించారు.
రాంకీపై ఫోకస్
గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు నిర్ణీత సమయంలో చెత్త తరలింపు వంటి విధులతో పాటు వర్నెలబుల్ గ్యార్బేజీ పాయింట్ (వీజీపీ)ల వద్ద సకాలంలో చెత్తను తరలించే బాధ్యతలను నిర్వహిస్తున్న రాంకీ సంస్థ పనితీరుపై దృష్టి సారించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఒప్పందం ప్రకారం చెత్త సేకరణ, తరలింపునకు ఎంగేజ్ చేయాల్సిన వాహనాల సంఖ్యను పెంచాలని కమిషనర్ రాంకీకి సూచించారు.






