వివాదాలకు కేరాఫ్ గా జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ కార్యాలయం

by Bhanu |   (  Updated:2025-05-07 15:51:50  IST  )

జీహెచ్ఎంసీ సర్కిల్ 14 (గోషామహల్) టౌన్ ప్లానింగ్ విభాగం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది .

వివాదాలకు కేరాఫ్ గా జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ కార్యాలయం
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : జీహెచ్ఎంసీ సర్కిల్ 14 (గోషామహల్) టౌన్ ప్లానింగ్ విభాగం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది . ఈ సర్కిల్ లో అనుమతులు తీసుకున్న నిర్మాణాలతో పాటు అక్రమ నిర్మాణాలు కూడా అధికంగానే ఉంటాయి. ముగ్గురు సెక్షన్ అధికారులు పని చేయాల్సిన చోట ఏసీపీ (టీపీ)తో పాటు ఒక్క సెక్షన్ అధికారి మాత్రమే పని చేస్తున్నారు. అది కూడా వారు కార్యాలయంలో ఎల్లప్పుడు అందుబాటులో లేకుండా పోతుండడం పనుల నిమిత్తం వచ్చే వారు ఇబ్బందులకు గురౌతున్నారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా కార్యాలయానికి వచ్చే వారి పట్ల సెక్షన్ అధికారి నరేష్ దురుసుగా మాట్లాడుతున్నారనే టాక్ మొదటి నుండి ఉంది . దీనికితోడు టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే ఇతర సిబ్బంది, చైన్ మెన్లతో కూడా ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. సిబ్బందితో సఖ్యతగా ఉండరని , ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏదైనా సమస్య గురించి మాట్లాడేందుకు ఫోన్ చేస్తే కనీసం రిప్లై ఇవ్వడం లేదని , దీంతో వారు కూడా ఆయన తీరు తో మండిపడుతున్నారు. అటు కార్యాలయానికి వచ్చే వారితోనూ , సొంత కార్యాలయ సిబ్బందితోనూ సెక్షన్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నవివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఈ నేపథ్యంలో జాంబాగ్ కార్పొరేటర్ తో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదుల వరకు వెళ్లింది.

ప్రభుత్వ కార్యాలయాలలో రౌడీల్లా వ్యవహరిస్తున్నారు : పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ కుమార్....

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి నరేష్ తో పాటు ఇతరులు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తూ రౌడీలా ప్రవర్తిస్తున్నారని , వారిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కట్టెలమండికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కట్టెలమండిలో ఓ ప్రతీప్ ఆర్య అనే వ్యక్తి చేస్తున్నఅక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని, ప్రతీప్ ఆర్యతో ఆయన కుమ్మక్కై తాను చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా దుర్భాషలాడుతూ జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ ముందే తనపై సెక్షన్ అధికారి నరేష్ దాడి చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు . ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఈ నెల 5వ తేదీన న్యాయస్థానం అనుమతి తీసుకుని సెక్షన్ అధికారి నరేష్ తో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు . అంతకు ముందు జీహెచ్ఎంసీ సర్కిల్ 14 ఏసీపీ , సెక్షన్ అధికారులు చేసిన ఫిర్యాదుపై అబిడ్స్ పీఎస్ పోలీసులు కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ పై కూడా కేసు నమోదు చేశారు .

సిబ్బందితోనూ సఖ్యతగా ఉండని ఎస్ ఓ...

గోషామహల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్ అధికారిగా పని చేస్తున్న నరేష్ తీరుపై సొంత కార్యాలయ సిబ్బంది సైతం మండిపడుతున్నారు. ఎవరితోనూ మర్యాదగా వ్యవహరించరని, అసలు ఆయనతో మాట్లాడాలంటేనే భయపడేలా ఉన్నామని సిబ్బంది వాపోతున్నారు. ఏసీపీ సైతం సెక్షన్ అధికారి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని సమాచారం . ఈ నేపథ్యంలో కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ తో గొడవ జరగడం, అది కేసుల వరకు వెళ్లడం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ అధికారులు మాకొద్దు : జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్లు....

ప్రజలు, ప్రజా ప్రతినిధులంటే లెక్కలేకుండా , అగౌర పర్చేలా మాట్లాడుతున్న జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంజులా సింగ్ , సెక్షన్ అధికారి నరేష్ లు తమ కొద్దని, వారిని వెంటనే గోషామహల్ సర్కిల్ నుండి బదిలీ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కు బుధవారం ఫిర్యాదు చేశారు . బీజేపీ ఫ్లోర్ లీడర్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ , గోషామహల్ డివిజన్ కార్పొరేటర్ లాల్ సింగ్ , జియాగూడ డివిజన్ కార్పొరేటర్ దర్శన్ ,జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ , బీజేపీ గోషామహల్ నియోజకవర్గం కన్వీనర్ కృష్ణ తదితరులు బల్దియా కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు . ఆయా అధికారులను తక్షణమే బదిలీ చేయాలని తాము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నామని కార్పొరేటర్ రాకేష్ జైశ్వాల్ తెలిపారు .


Next Story