- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: రాష్ట్ర బడ్జెట్‌పై బల్దియా కోటి ఆశలు.. రూ.5,700 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు
స్టేట్ బడ్జెట్‌పై బల్దియా భారీగా ఆశలు పెట్టుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ బడ్జెట్‌పై బల్దియా భారీగా ఆశలు పెట్టుకుంది. అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు అప్పుల తీర్చడానికి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్‌లో రూ.5,700 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కోరింది. ప్రధానంగా హెచ్ సిటీ(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్‌ఫర్ మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పనుల కోసం రూ.4 వేల కోట్లు కావాలని కోరింది. అలాగే అప్పులు తీర్చడానికి క్రెడిట్ సర్వీసు కింద రూ.1200 కోట్లు కేటాయించాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.500 కోట్లు కేటాయించాలని కోరింది. గతేడాది రూ.3,300 కోట్లు కేటాయించాలని కోరగా, అప్పట్లో ప్రభుత్వం రూ.2,650 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. ఇందులో రూ.1,326 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రూ.5,700 కోట్లు కావాలని కోరడంతో ఎన్ని నిధులు కేటాయిస్తుందన్నది చూడాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటికి కూడా ఆర్థికంగా కోలుకోలేకపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాస్తా ఇబ్బందులు నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఈసారి బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయిస్తే నగరం మరింత డెవలప్ కానుంది.
హెచ్-సిటీ పనుల కోసం..
ప్రస్తుతం నగరంలో చేపట్టే పనుల్లో హెచ్-సిటీ పనులే ఎంతో కీలకం కానున్నాయి. హెచ్-సిటీ ద్వారా రూ.7,032 కోట్లతో 25 పనులలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. వీటితో పాటు రోడ్డు విస్తరణకు సంబంధించి మరో 13 పనులు చేపట్టనుంది. ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాసులను రెండు ప్యాకేజీల కింద బల్దియా అధికారులు చేపట్టనున్నారు. వీటికి టెండర్లు కూడా పిలిచిన విషయం విధితమే. రూ.580 కోట్ల అంచనా వ్యయంతో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్, ముగ్ధా జంక్షన్ రెండు స్టీల్ బ్రిడ్జిలు, మూడు అండర్ పాసులను నిర్మించనున్నారు. వీటిన్నింటిని ఫస్ట్ ప్యాకేజీ కింద పనులు చేయనున్నారు. ఇక రూ.510 కోట్లతో సెకండ్ ప్యాకేజీ కింద పనులు చేయనున్నారు. రోడ్డు నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో నాలుగు స్టీల్ బ్రిడ్జిలు, నాలుగు అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. వీటిలో సగం నిధులు స్ట్రక్చర్ నిర్మాణానికి అయితే మరో సగం భూసేకరణకే కానున్నాయని అధికారులు చెపుతున్నారు. ఈ పనులు ఏడాదిన్నరలో చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నాలాలకు మాస్టర్ ప్లాన్..
హెచ్-సిటీలో భాగంగానే నాలాలను కూడా అభివృద్ధి చేయాలని బల్దియా నిర్ణయించింది. అంతే కాదు నాలాల కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ఆధారంగానే పనులు చేయనున్నట్టు అధికారులు చెపుతున్నారు. గత ప్రభుత్వం స్టాటజిక్‌నాలా డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఎన్డీపీ) మొదటి దశలో 37 నాలాల పనులు చేపట్టింది. ఇందులో నాలుగు పనులు మినహా అన్ని పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హెచ్-సిటీలోనే ఈ పనులు చేయాలని నిర్ణయించింది. రెండో దశలో రూ.5,135 కోట్లతో సిటీతో పాటు శివారు మున్సిపాలిటీల్లో 415 పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే కొన్ని పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి.
అప్పులు రూ.5,880 కోట్లు..
ఒకప్పుడు నిధులతో బల్దియా ఖజానా కలకలలాడింది. కానీ ప్రస్తుతం అప్పుల కుప్పైంది. జీహెచ్ఎంసీ 2016 నుంచి 2023 వరకు వివిధ పనుల కోసం రూ.6,880 కోట్ల అప్పులు చేసింది. వీటిలో బాండ్లు, బ్యాంక్ టర్మ్ లోన్లు ఉన్నాయి. స్టాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్ డీపీ) కోసం రూ.4,250 కోట్లు అప్పు చేయగా, ఇందులో బాండ్ల ద్వారా రూ.495 కోట్లు సేకరించగా, రూ.200 కోట్లు 8.90 శాతం, రూ.195 కోట్లు 9.38శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. రూ.2,500 కోట్లను 8.65 శాతం వడ్డీకి రూపీ టర్న్‌లోన్ తీసుకోగా, మరోసారి రూ.505 కోట్లను 7.75 శాతం వడ్డీకి రూపీ టర్మ్‌లోన్ తీసుకుంది. వీటితో పాటు మరో రూ.750 కోట్లను ఇటీవల సేకరించింది. కాంప్రెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం(సీఆర్‌ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు తీసుకుంది. ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లు 7.20 శాతం వడ్డీతో తీసుకుంది. అలాగే జేఎన్‌ఎన్‌యూఆర్ఎం ఇండ్ల కోసం రూ.140 కోట్ల హడ్కో నుంచి సేకరించింది. ఇందులో రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీతో తీసుకోగా, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీతో తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్ ద్వారా రూ.350 కోట్ల అప్పు చేసింది. రూ.6,880 కోట్లలో వెయ్యికోట్లను గతేడాది నుంచి బల్దియా తిరిగి చెల్లించింది. దీంతో ప్రస్తుతం రూ.5,880 కోట్ల అప్పులున్నాయి. ఈ బడ్జెట్‌లో అప్పులు తీర్చేందుకు నిధులు కేటాయిస్తే మరింత భారం తగ్గనుందని అధికారులు భావిస్తున్నారు.
భారంగా భూసేకరణ..
ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం ఒకెత్తయితే వాటికోసం భూసేకరణ మరో ఎత్తు. ప్రభుత్వం కేటాయించిన రూ.7,032 కోట్లల్లో భూసేకరణ కోసమే అధిక నిధుల అవుతాయని అధికారులు చెపుతున్నారు. భూసేకరణ పాత బకాయిలు రూ.50 0కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తే బల్దియాకు ఉపశమనంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.






