- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదనీటి నెట్‌వర్క్‌పై సర్వే.. యాక్షన్ ప్లాన్ షురూ చేసిన జీహెచ్ఎంసీ
భారీ వర్షాలు, వరదలు, ముంపు ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది.

దిశ, సిటీ బ్యూరో : భారీ వర్షాలు, వరదలు, ముంపు ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. కొత్తగా 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను తయారు చేసేందుకు టెండర్లు సైతం పిలిచింది. వర్షం పడినప్పుడల్లా అమీర్‌పేట్ ప్రాంతంలోని మైత్రీవనం, గంగుబాయి బస్తీలు నీట మునుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాలు నీట మునిగేందుకు కారణాలేంటి? వరదనీటి కాలువ నెట్‌వర్క్ ఎలా ఉంది? నాలాల్లో నీటి ప్రవాహం.. వంటి అంశాలను అధ్యయనం చేయడంతో పాటు సమగ్రంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కన్సల్టెన్సీ కోసం ఎక్స్‌ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) పేరుతో జీహెచ్ఎంసీ టెండర్లు పిలవడంతో పాటు ఏజెన్సీని సైతం ఫైనల్ చేసింది. ఈ టెండర్లను ఎస్‌సీపీఈ సంస్థ దక్కించుకుంది.
నెలరోజుల్లోనే డీపీఆర్
జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ సర్కిల్, అమీర్‌పేట్ డివిజన్ పరిధిలోని మైత్రీవనం, గంగుబాయి బస్తీల్లో సమగ్రంగా సర్వే చేయడంతో పాటు ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (DPR) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణకాంత్ పార్క్ మధురానగర్, హర్షమెస్, మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్ సెంటర్ నుంచి సత్యం థియేటర్ ప్రాంతాల మీదుగా ఎక్కువగా వరద ప్రవహిస్తోంది. 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మైత్రీవనం, గంగబాయి బస్తీలు నీటమునిగాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ హెడ్ ఆఫీస్ ఎదుట రోడ్డంతా చెరువును తలపించింది. హెచ్ఎండీఏ ఆఫీస్ సెల్లార్ సైతం మునిగిపోయింది. మరుసటి రోజే సీఎం రేవంత్‌రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగానే సమగ్రంగా సర్వే నిర్వహించి నెల రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.
ఎన్‌సీపీఈకి డీపీఆర్ బాధ్యతలు
మైత్రీవనం, గంగుబాయిబస్తీల్లో వరదనీటి కాలువ నెట్ వర్క్, నాలాల పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కన్సల్టెన్సీ కోసం ఎక్స్‌ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) పేరుతో జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్లను ఎన్‌సీపీఈ సంస్థ దక్కించుకుంది. ఈనెల 11న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ప్రాజెక్టు విభాగం ఇంజినీరింగ్ అధికారులు టెండర్ పిలిచారు. 14న టెండర్ బిడ్ ఓపెన్ చేశారు. అన్నింటికీ అర్హత సాధించిన ఎన్‌సీపీఈ టెండర్ దక్కించుకుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ ఏజెన్సీకి గతంలో పలు మున్సిపాలిటీలు, గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులు, వరదనీటి కాలువ నెట్‌వర్క్ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసిన అనుభవం ఉంది. నెలరోజుల్లో డీపీఆర్ అందజేయాలని జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.






