విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం ఇమ్మిగ్రేష‌న్ వీసాల్లో మోసం

by Ratna Kumari |

విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్ సంస్థను సంప్రదిస్తే కోట్లాది రూపాయలు వసూలు చేసి తమను మోసగించిందని

విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం ఇమ్మిగ్రేష‌న్ వీసాల్లో మోసం
X

దిశ, ఖైరతాబాద్ : విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్ సంస్థను సంప్రదిస్తే కోట్లాది రూపాయలు వసూలు చేసి తమను మోసగించిందని పలువురు బాధితులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు రవీందర్ రెడ్డి, ప్రశాంతి, రవి తదితరులు సంస్థ యజమాని వేదుల శ్రీకిరణ్ తమను మోసగించిన తీరును వివరించారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 2024లో గచ్చిబౌలిలోని శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్ ను సంప్రదించగా, తన వద్ద తొలుత రూ.5లక్షలు వసూలు చేశారని, ఆ తర్వాత ప్రాససింగ్ పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. ఈ విషయమంపై మేనేజింగ్ డైరెక్టర్ వేదుల శ్రీకిరణ్ ను నిలదీశానని, దీంతో ఫేక్ డ్యాకుమెంట్లు ఇచ్చి పంపించాడన్నారు.

ఇక ఆ తర్వాత కనిపించకుండా పోయారన్నారు. బాధితుడు రవి మాట్లాడుతూ తాను ముందు 13 లక్షలు కట్టానని, ఆ తర్వాత ఒరిజినల్ వీసా కావాలంటే మరో ఎనిమిది లక్షలు కట్టామన్నారని, దీంతో అప్పులు చేసి మరీ వారు అడిగిన డబ్బులు కట్టానని, కానీ వీసా ఇవ్వలేదన్నారు. పోలీసులను ఆశ్రయించి కోర్టులో కేసు పెడుతానని ఓ చెల్లని చెక్కు ఇచ్చి పరారయ్యాడని తెలిపారు. అప్పుల వారి వేదింపులు ఎక్కువయ్యాయని, తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. బాధితురాలు ప్రశాంతి మాట్లాడుతూ విదేశాల్లో మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని మంచిగా చూసుకుందామని అప్పులు తెచ్చి ఈ సంస్థలో డబ్బులు కట్టి మోసపోయాయని తెలిపారు. తనతో పాటు 87 మంది వరకు ఇప్పటి వరకు రూ.10కోట్లకుపైగా డబ్బులు కట్టి మోసపోయారని, బాధితులందరం కలిసి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను ఇద్దరు చిన్న పిల్లలను వెంట పెట్టుకొని గచ్చిబౌలి సీపీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరుగలేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీలు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Next Story