‘తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది’.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-15 15:07:29  IST  )

ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారిందని, దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు.

‘తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది’.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, రాంనగర్: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారిందని, దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఖురాన్ ఆవిర్భవించిన పవిత్ర ఈ రంజాన్ మాసంలో విశ్వశాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని, అదేవిధంగా శాంతి స్థాపన కోసం కృషి చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. హైదరాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్ పూర్ డివిజన్ అంజుమాన్ స్కూల్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో భారీగా రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నేత ముఠా జై సింహా పాల్గొని ముస్లిం మహిళలకు రేషన్ కిట్స్ అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయంలో పేదల అభివృద్ధి కోరుకుని షాది ముబారక్, కెసిఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల అభివృద్ధికి తోడ్పడింది అని అన్నారు. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం లాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలలో కనీసం హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా నిర్మించలేక పోగా, ఒక లక్ష ఇల్లు కూల్చి వేశారన్నారు. ఉత్తరప్రదేశ్ యోగి తరహా, హైదరాబాద్ లో కూడా బుల్డోజర్లతో పేదల ఇల్లు కూల్చుతున్నారన్నారు. అందులో మూసి, హైడ్రా పేరున మూసి, చాదర్ ఘాట్ ప్రాంతంలో ఎక్కువగా ముస్లింల ఇల్లులు కూల్చి, జూనియర్ మోడీ, యోగి గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో కూడా బుల్డోజర్ రాజ్యం నడిపిస్తున్నారని విమర్శించారు.

బస్తీ దవాఖానలో కూడా డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రపంచంలోని ముస్లింలు శాంతి , సౌహార్థం నెలకొనాలని ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల వలనే మైనార్టీలు లబ్ధి పొందారని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరి, సోదరులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాసరావు, మీడియా ఇంచార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు చాంద్ పాషా, మోసిన్, షార్పదిన్, కరీం తదితరులు పాల్గొన్నారు.

Harish Rao: బీసీ డిక్లరేషన్‍కు అతిగతి లేకుండా పోయింది: హరీశ్ రావు

Next Story