- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రాజెక్టులను అడ్డుకోండి: సీఎం రేవంత్‌కి హరీశ్‌రావు లేఖ
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం హరీశ్‌రావు లేఖ రాశారు..

దిశ, తెలంగాణ బ్యూరో: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం హరీశ్‌రావు లేఖ రాశారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటి అని.. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని తెలిపారు. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరువును పారదోలిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తున్నదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తున్నారని.. ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ద్రోహ బుద్ధితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్‌వోసీ తెస్తున్నామనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా? తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? అని నిలదీశారు.
2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి అనుమతించినట్లేనని ఆరోపించారు. కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని తెలిపారు. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని.. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని పేర్కొన్నారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని సూచించారు.






